తెరాసకు తెలంగాణా జిల్లాలలో మంచి పట్టు ఉన్నప్పటికీ, జి.హెచ్.ఎం.సి. పరిధిలో బొత్తిగా పట్టులేకపోవడంతో అక్కడి నుంచి పోటీ చేయడానికి భయపడుతూ ఏవో కుంటిసాకులు చెపుతూ ఇంత కాలం ఎన్నికలను వాయిదా వేసుకొంటూ వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించేవి. అవి ఎంత ఎద్దేవా చేస్తున్నా, విమర్శలు చేస్తున్నా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పట్టించుకోకుండా గ్రేటర్ ఎన్నికలలో తన పార్టీని గెలిపించడానికి ఏమేమీ చేయాలో అన్ని ఏర్పాట్లు ఈ ఏడాది కాలంలో పూర్తి చేసుకొని ఎన్నికలకి వెళ్ళారు. ఆయనేమీ ఆ పనులను రహస్యంగా చేయలేదు. ఈ ఏడాది కాలంలో ఆయనేమీ చేసినా అది గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారని, గ్రేటర్ పరిధిలో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ కాలక్షేపం చేసేవి. అంతే తప్ప ఆయనని చూసి తాము కూడా గ్రేటర్ ఎన్నికల కోసం ముందుగానే సిద్దం అవ్వాలనుకోలేదు.
తత్ఫలితంగా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి అంతవరకు పోటీ చేయడానికి కూడా భయపడిన తెరాస మిత్రపక్షమయిన మజ్లీస్ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవగలననే ఆత్మవిశ్వాసం కనబరిచే స్థాయికి ఎదిగితే, హైదరాబాద్ జంట నగరాలలో మంచి పట్టు ఉన్న తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘ఈ ఎన్నికలలో గౌరవప్రదమయిన సీట్లు అయినా సాధించుకోగలమా…’అనే స్థాయికి దిగజారాయి. వాటి ఆ ఆత్మన్యూనతని, బలహీనతని కూడా తెరాస చాలా తెలివిగా ఒడిసిపట్టుకొని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రచారంలో వాడేసుకొంది. ఈ ఎన్నికలలో తమ పార్టీ రికార్డు సృష్టించబోతోందని కాంగ్రెస్ నేతలను చెప్పిన మాటలను పట్టుకొని “అవును ఈసారి కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యి సరికొత్త రికార్డు సృష్టించబోతోందని” తెరాస నేతలు చేసిన ప్రచారం బాగా హైలైట్ అయ్యింది. అది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతబస్తీలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ ఆలిపై మజ్లీస్ కార్యకర్తల దాడిని హైలట్ చేసుకొని లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించక పోవచ్చును. ఎందుకంటే పాతబస్తీలో మజ్లీస్ పార్టీకి మంచి పట్టు ఉంది.
కాంగ్రెస్ తో పోలిస్తే తెదేపా-బీజేపీల పరిస్థితి కొంచెం మెరుగుగా కనిపిస్తున్నప్పటికీ, అవి కూడా గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించలేవని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా ప్రకటించుకొన్నారు. ఈ ఎన్నికలలో తెరాసకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ స్వంతంగా మెజార్టీ సాధించలేకపోయినా మజ్లీస్ సహకారంతో గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఓడిపోతే తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణాలో బాగా దెబ్బతినవచ్చును. ఎందుకంటే తమకు మంచి పట్టున్న గ్రేటర్ లోనే అవి విజయం సాధించలేకపోతే ఇంకా వేరే చోట్ల ఏవిధంగా నెగ్గుకురాగాలవనే సందేహం ప్రజలకే కాదు ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా కలగవచ్చును. అది వారిలో ఆత్మన్యూనతని కలిగించి, తెరాస చేపడుతున్న ‘ఆపరేషన్ ఆకర్ష’ పధకానికి లొంగిపోయేలా చేయవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాసకే పూర్తి మెజారిటీ వస్తే ఇక తెరాసను అడ్డుకోవడం ప్రతిపక్షాల వలన కాకపోవచ్చును. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటాయో ఎన్ని తెరాసలో కలిసిపోతాయో ఎవరూ చెప్పలేరు.
ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించకపోయినా గ్రేటర్ పీఠం దక్కించుకోగలిగితే ఇక తెలంగాణాలో కేసీఆర్ మాట వేదవాక్కే అవుతుంది. గ్రేటర్ ఎన్నికల కోసమే ఏడాది ముందు నుండి తీవ్ర కసరత్తు చేసి విజయం సాధించితే, 2019లో జరిగే ఎన్నికలకు కేసీఆర్ ఇప్పటి నుండే ప్రణాళికలు, వ్యూహాలు రచించకుండా ఉంటారని అనుకోలేము. కనుక ఈరోజు సాయంత్రం వెలువడే గ్రేటర్ ఫలితాలు కేవలం డానికే పరిమితం కావు అన్ని పార్టీల రాజకీయ భవితవ్యం తేల్చే ఫలితాలని భావించవచ్చును.