రాజకీయ పార్టీలు ప్రజల్ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నాయో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరూపిస్తున్నాయి. ప్రజల ఆశల్ని ఆసరాగా చేసుకుని అసలు తమ పరిధిలో లేని హామీలను సైతం రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. అవి చేస్తారా లేదా..కనీస అవగాహన ప్రజలకు ఉండదని.. ఉన్నా లేకపోయినా.. ప్రజలు నమ్మితే చాలన్నట్లుగా ఆయా పార్టీల తీరు ఉంది. అందుకే..కరోనా వ్యాక్సిన్ నుంచి చలాన్ల రద్దు వరకూ అన్ని రకాల హామీలు ఇచ్చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ అంటే ఓ స్థానిక సంస్థ. ప్రజల మౌలిక సదుపాయాలు.. అంటే నీరు, రోడ్లు, మురుగునీరు, ప్లానింగ్ వంటి చిన్న చిన్న అంశాలకు సంబంధించిన పాలక సంస్థ. వాటి నిర్వహణకు ఆదాయం.. ఇంటిపన్ను… ఆస్తి పన్ను.. దుకాణాల పన్ను లాంటి వాటి ద్వారా సంపాదించుకుని.. వాటితో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఆ నగర పాలక సంస్థకు అంతకు మించి అధికారం ఉండదు. కానీ రాజకీయ పార్టీలు.. కరోనా వ్యాక్సిన్ హామీ ఇచ్చేశాయి. అసలు రాని కరోనా వ్యాక్సిన్ ను.. గ్రేటర్లో గెలిపిస్తే ఎలా ఇస్తారో ఆ పార్టీలే చెప్పుకోవాలి.
ఇక ఎల్ఆర్ఎస్, ఉచిత విద్యుత్ ఇలా సమస్తం హామీలు.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. అవి ఇస్తే గిస్తే.. రాష్ట్రం మొత్తం వర్తింప చేయాలి. ఒక్క గ్రేటర్లోనే హామీ ఇవ్వడం లేదు. ఇలాంటి హామీలు మేనిఫెస్టోల నిండా ఉన్నాయి. టీఆర్ఎస్ మాత్రమే కాదు.. అధికారంలో లేని కాంగ్రెస్ కూడా అదే హామీలు ఇచ్చింది. మళ్లీ ఒకరికొకరు.. తమ మేనిఫెస్టో కాపీ కొట్టారంటే.. తమ మేనిఫెస్టోను కాపీ కొట్టారని విమర్శలు కూడా చేసుకుంటున్నారు. తామేదో నెరవేర్చగలిగే హామీలు ఇస్తున్నట్లుగా ఫోజులు కొడుతున్నారు. అంతిమంగా మాత్రం.. ప్రజలు ఓ మాదిరిగా కూడా రాజకీయ నేతలకు కనిపించడం లేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.