ఏపిలో ఇప్పుడు హాట్ టాపిక్ రాజధాని నిర్మాణమూ కాదు… ప్రత్యేక హోదా అంతకంటే కాదు. కాపు కులస్తులకు రిజర్వేషన్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పవచ్చును. అంతమాత్రన్న రాజకీయపార్టీలకీ, వాటి నేతలకీ వారిపై ప్రేమ కారిపోతోందని కాదు. రిజర్వేషన్ల గురించి మాట్లాడి వారిని తమ పార్టీల వైపు ఆకర్షించాలనే తాపత్రయమే తప్ప మరొకటి కాదు.
ఆ పేరు చెప్పుకొనే రాజకీయాలలో మళ్ళీ చక్రం తిప్పడానికి కొందరు పాత నాయకులు కూడా సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు బలమయిన సమస్యలు, కారణాలు ఏవీ చేతిలో లేకపోవడంతో అటువంటి వారితో చేతులు కలిపి కాపుల తరపున పోరాడేందుకు కొందరు ప్రతిపక్ష నాయకులు కూడా సిద్దం అయిపోతున్నారు. వారందరూ కలిసి కాపులను కాకులలాగ ఎక్కడ ఎగరేసుకొని వెళ్లిపోతారో అనే భయంతో అధికార తెదేపా నేతలు కూడా కాపుల సంక్షేమం, అభివృద్ధి, రిజర్వేషన్ల గురించి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారి ఉద్దేశ్యాలు ఎవయినప్పటికీ, తమ ప్రమేయం లేకుండానే వాళ్ళందరూ కలిసి తమ తరపున పోరాడి తమకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు కనుక కాపు కులస్తులు కూడా ఈ పరిణామాలను చూసి సంతోషిస్తుండవచ్చును. కనుక వారి పోరాటాలకి కాపు కులస్తులు మద్దతు ఈయవచ్చును.
అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ కూడా దీనిపై గట్టిగానే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాపులకు చాలా అన్యాయం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కాపు కులస్తులయిన చిరంజీవి, బొత్స సత్యనారాయణలకు అన్ని అర్హతలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ వారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు? 35ఏళ్ల పాటు రాజకీయాలలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇన్నేళ్ళు కాపుల రిజర్వేషన్ల గురించి ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్నీ కాపులను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప వారి కోసమే చేసింది ఏమీ లేదని అన్నారు. కేవలం తమ టిడిపి మాత్రమే వారికి అన్ని విధాలా న్యాయం చేయగలదని అన్నారు. తమ పార్టీకి కాపులు, బిసిలు రెండు కళ్ళు అని చెప్పారు. కేవలం తమ పార్టీకి మాత్రమే కాపుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంది కనుక తమ పార్టీ మాత్రమే వారికి రిజర్వేషన్లు కల్పించగలదని చెప్పారు.