ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరయినా మాట్లాడితే తెదేపా నేతలు అదేదో బూతు పదం అన్నట్లు ఉలిక్కిపడి దాని గురించి మాట్లాడినవారిపై ఎదురుదాడి చేయడం పరిపాటయిపోయిందని మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓసారెప్పుడో అన్నారు. తెదేపా నేతలు ఎవరయినా ప్రత్యేక హోదా గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అదేవిధంగా స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని తెలిసి కూడా తెదేపా నేతలు ప్రధాని నరేంద్ర మోడిని అనుమానిస్తున్నట్లు మాట్లాడటం చాలా తప్పని, కనుక వారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని నరేంద్ర మోడీని క్షమాపణలు కోరాలని బీజేపీ నేత సోము వీర్రాజు వాదిస్తున్నారు.
రాష్ట్రంలో వారి వాదోపవాదాలు కొనసాగుతుంటే, బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా కావాలని చేసిన డిమాండ్ పై స్పందిస్తూ “ప్రత్యేక హోదా ఇచ్చే రోజులు ముగిసాయి. కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక హోదా మాత్రం అది పూర్తయ్యేవరకు కొనసాగిస్తాము,” అని విస్పష్టంగా చెప్పారు. అంటే తెదేపా, బీజేపీ నేతలు, మంత్రులు చెపుతున్న “నీతి ఆయోగ్ పరిశీలనలో ఏపీకి ప్రత్యేక హోదా” అనేది ఒక కట్టుకధ అని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, రాష్ట్ర బీజేపీ నేతలు అందరూ దాని గురించి యుద్ధాలు చేసుకోవడం చూస్తుంటే అందరూ కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతునట్లు అర్ధం అవుతోంది.
ఇదివరకు రాష్ట్ర విభజన అనివార్యమని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలన్నీ చివరి నిమిషం వరకు ప్రజలను తప్పు ద్రోవలో నడిపించాయి తప్ప రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమీ సాధించుకోవాలనే దాని కోసం ఏ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నించలేదు. తత్ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం తనకు తోచినట్లు రాష్ట్రవిభజన చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు, దుస్థితి ఎదురయిందో అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయ పార్టీలన్నీ అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. రాని ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు అన్నీ పోరాడుకొంటూ రావలసిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని వదిలిపెడుతున్నాయి. ప్రత్యేక హోదా సాధించడం కంటే ఆపేరుతో తమతమ పార్టీలకు రాజకీయ లబ్ది కలిగేలా చూసుకోవడమే చాలా ముఖ్యం అన్నట్లు అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంగతి కేంద్రం ఎప్పుడో స్పష్టం చేసింది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ నిన్న దానిని మరో మారు దృవీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడం ఎలాగు సాధ్యం కాదని, తమ పార్టీ రాష్ట్రంలో ఎలాగు అధికారంలోకి రాదని ముందే పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం, చాలా దూరదృష్టితోనే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తగిలించి ఉండవచ్చును. రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలు పోరాడుకొనేలా చేస్తోంది. ప్రత్యేక హోదా హామీపై మాట తప్పినందుకు బీజేపీతో ఏవిధంగా వ్యవహరించాలో మున్ముందు తాపీగా ఆలోచించుకోవచ్చును. కానీ ముందు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఏవిధంగా సాధించుకోవాలో అందరూ ఆలోచించడం మంచిది లేకుంటే ఏదో ఒకరోజు అది కూడా “నీతి ఆయోగ్ పరిశీలన జాబితా” లోకి చేరిపోతుంది.