నవంబర్ 21న జరుగబోయే వరంగల్ ఉప ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు చాలా ఇబ్బందిపడుతున్నాయి. అందుకు ప్రధాన కారణం వరంగల్ లోక్ సభ నియోజకవర్గం దళితులకు రిజర్వ్ చేయబడి ఉండటమే. కనుక అని పార్టీలు తప్పనిసరిగా దళిత అభ్యర్ధిని అక్కడి నుంచి నిలబెట్టవలసి ఉంటుంది. కేవలం దళితుడయితే సరిపోదు. ఆ అభ్యర్ధి మంచి ఆర్ధబలం, అంగబలం, ప్రజాధారణ కూడా కలిగి ఉండాలి. ప్రజాధారణ ఉన్నా లేకపోయినా మిగిలిన రెండూ తప్పనిసరి. లేకుంటే సదరు రాజకీయ పార్టీలే ఆ అభ్యర్ధి ఎన్నికల ఖర్చుని సమకూర్చి అతను లేదా ఆమె గెలిచేందుకు చెమటోడ్చవలసి వస్తుంది.
అటువంటి ప్రాధమిక అర్హతలన్నీ ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జి.వివేక్. అందుకే తెరాస కూడా ఆయనని పార్టీలోకి ఆకర్షించి తెరాస తరపున వరంగల్ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నించి భంగపడింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకే ప్రాధాన్యం ఇస్తోంది కానీ ఆయన పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపడం లేదని సమాచారం. దానితో కాంగ్రెస్ పార్టీ కూడా బలమయిన అభ్యర్ధి కోసం వెతుకుతోంది. రాజయ్య లేదా విజయరామారావులలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. వివేక్ ని ఆకర్షించాలని ప్రయత్నించి భంగపడిన తెరాస, తన వద్ద ఏకంగా 25మంది వరకు అభ్యర్ధులు క్యూలో నిలబడున్నారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది కానీ ఇంతవరకు ఎవరిపేరు ఖరారు చేయలేకపోయింది. కారణం ముందు చెప్పుకొన్నదే.
తెరాస తరపున పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్న మాట వాస్తవం. అయితే వారిలో చాలా మందికి అర్ధబలం, అంగబలం లేవు. కనుక వారిని పోటీలో నిలబెడితే ఎన్నికల ఖర్చు అంతా తెరాసయే భరించాల్సి వస్తుంది. అందుకే తెరాస కూడా మంచి బలమయిన అభ్యర్ధి కోసం వెతుకుతోంది. సమాజంలో వెనుకబడిన దళితులు, మైనార్టీలు, మహిళకు చట్ట సభలలో సముచిత స్థానం కల్పించడానికే కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్ చేయబడ్డాయి. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆ రిజర్వ్ చేసిన స్థానాలలో పోటీ చేయడానికి అర్ధబలం, అంగ బలం ఉన్న దళితులకే అవకాశాలు కలిగి ఉండటం. ఏ ప్రయోజనం ఆశించి ఇటువంటి చట్టం చేసుకొన్నామో దానినే మన రాజకీయ పార్టీలు పరిహసిస్తునట్లుంది.