ప్రొఫెసర్ కోదండరామ్ తను ప్రత్యక్ష రాజకీయాలలోకి రాదలచుకాలేదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసారు. అయినా కూడా అన్ని పార్టీలు ఆయనని తమ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేయడం మానుకోలేదు. తెలంగాణా సాధనలో ఆయన పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఉన్నత విద్యావంతుడు, మేధావి, తెలంగాణా రాష్ట్ర శ్రేయోభిలాషిగా ప్రజలలో గౌరవం పొందుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వ్యక్తితమ పార్టీలో చేరితే, తెరాస ప్రభుత్వానికి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి తమ పార్టీ సమవుజ్జీగా తయారవుతుందని వారి ఆలోచన. ఇటీవల ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పదవీ విరమణ చేశారు. ఆ సందర్భంగా ఆయనని సన్మానించే వంకతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. అందరి కంటే ముందుగా తెలంగాణా తెదేపా అధ్యక్షుడు యల్.రమణ వెళ్లి ఆయనని కలిసి తమ పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ, ఆంద్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా త్వరలో ఆయనని కలువబోతున్నట్లు సమాచారం.
ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా తెలంగాణా అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు. మళ్ళీ నిన్న రైతుల ఆత్మహత్యల కేసులో తెలంగాణా విద్యావంతుల వేదిక తరపున వాదించేందుకు తనను కూడా ఇంప్లీడ్ చేయమని కోరుతూ హైకోర్టు ఒక పిటిషన్ వేశారు. కనుక ఆయన తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతూ ఇదే అదునుగా ఆయనని తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆయన ఏ పార్టీలోను చేరకపోవచ్చును. ఎందుకంటే ఇంతవరకు ఆయన పార్టీలకు అతీతంగా ఉన్నందునే రాష్ట్ర ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా గౌరవిస్తున్నాయి. కానీ ఆయన ఏదయినా ఒక పార్టీలో చేరినట్లయితే ఇక ఆయన ఆ పార్టీకి చెందిన వ్యక్తిగానే అందరూ పరిగణిస్తారు. ఆ పార్టీ తప్పొప్పులకు ఆయనను కూడా బాధ్యులు చేసి విమర్శలు గుప్పించవచ్చును. ఇప్పుడు ఏ పార్టీలు ఆయనని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాయో రేపు అవే ఆయనపై విమర్శలు గుప్పించవచ్చును. ఇంతవరకు అందరివాడుగా ఉన్న ఆయన కొందరివాడుగా మారిపోతారు. ఒకవేళ ఆయన ఏదయినారాజకీయ పార్టీలో చేరినట్లయితే అన్నిటికంటే ముందు ఆయన స్వాతంత్రం కోల్పోతారు. ఇంతవరకు స్వతంత్రంగా పనిచేసిన ఆయన ఏదయినా పార్టీలో చేరితే సదరు పార్టీ అధిష్టానానికి అనుగుణంగా, దాని ముందు తలవంచుకొని పనిచేయవలసి ఉంటుంది. కనుక ఆయన ఏ పార్టీలో చేరకపోవచ్చును. కానీ ఏదో ఒక బలమయిన రాజకీయ పార్టీ అండ దండలులేనిదే ప్రభుత్వంతో పోరాడటం చాలా కష్టం. ఒకవేళ పోరాడాలనుకొన్నా ఆయనకీ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపకపోవచ్చును. కనుక ఆయన ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసుకోక తప్పదు.
.