దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ముందుగా ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు చెప్పి.. కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. కరోనా కష్టాలను గుర్తు తెచ్చుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కన్నీటి పర్యంతమయ్యారు. అదయిన తర్వాత .. తెలుగు రాష్ట్రాల టీకా వారియర్స్‌తో మాట్లాడేటప్పుడు.. గురజాడ పద్యం.. “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్”ను తెలుగులోనే చదివి వినిపించారు. ప్రపంచానికి కరోనా టీకా గమ్యంగా భారత్ మారిందన్నారు.
ప్రధానమంత్రి అలా మాట్లాడగానే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలు కూడా.. వ్యాక్సిన్ విషయంలో తమ హడావుడి తాము చేశారు. అసలే టెన్షన్లో ఉండే వైద్య సిబ్బందిని వారి పని వారు చేసుకోనివ్వలేదు. కొన్ని చోట్ల నేరుగా ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు వేలు పెట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి.. కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టీకాలు వేయించుకున్న వారితో మాట్లాడారు. అయితే.. టీకాల కార్యక్రమం ప్రచారం కోసం వేసిన పోస్టర్లలో ఎక్కడా ప్రధాని మోడీ ఫోటో లేదు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం వేయిస్తున్న టీకా అన్నట్లుగా ఏపీ సర్కార్ ప్రచారం ఉండటంతో… ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మండిపోయింది. వెంటనే ఆయన ట్విట్టర్ ఓపెన్ చేసి..జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై ఫైరయ్యారు. మోడీ ఫోటో లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ప్రకటించారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో జోక్యం చేసుకోలేదు. కానీ.. ఆయన పార్టీ నేతలందరూ.. ఈ కార్యక్రమంలో ఇంక్లూడ్ కావాలని సందేశం ఇచ్చారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద టీఆర్ఎస్ నేతల హడావుడి కనిపించింది. వైద్య మంత్రిఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రిలో టీకా కూడా వేయించుకున్నారు. మొత్తానికి కరోనాను జయించేలా వచ్చిన టీకా విషయంలో.. క్రెడిట్ కోసం.. రాజకీయ పార్టీలన్నీతాపత్రయ పడుతున్నాయి. ప్రజలందరికీ ఉచితంగా వాటిని అందించినప్పుడే వారి తాపత్రయానికి క్రెడిట్ లభిస్తుందని అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల వరకూ ఇచ్చి.. సామాన్య జనాన్ని కొనుక్కోవాలని చెబితే.. ప్రజలు ఆగ్రహిస్తారని అంటున్నారు.