నకిలీ మధ్య త్రాగి నిన్న విజయవాడలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దానిపై అప్పుడే రాజకీయాలు మొదలయిపోయాయి. ఒకవైపు భాదిత కుటుంబాలు తమా కుటుంబ సభ్యుడిని కోల్పోయినందుకు తీవ్ర విషాదంలో ఉంటే, వారిని పరామర్శించడానికి వెళ్ళిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారిని ఓదార్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఆయన, నారా లోకేష్ ఈ అక్రమ మద్యం అమ్మకాలలో వాటాలు అందుకొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో మద్యనిషేధం విధించాలని లేకుంటే తను ముఖ్యమంత్రి కాగానే నిషేధం అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ. 20 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఇక రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మల్లాది విష్ణు ప్రభుత్వ అక్రమాలను, అవినీతిని ఎండగడుతున్నందునే, ఆయనను అన్యాయంగా ఈ నకిలీ మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
నకిలీ మద్యం త్రాగి మనుషులు చనిపోతే అందుకు కారకులను కనిపెట్టి అరెస్ట్ చేసి శిక్షించమని కోరకుండా తక్షణమే రాష్ట్రంలో మద్యనిషేధం విధించమని లేకుంటే తను ముఖ్యమంత్రి అవగానే విధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఆయన అధికారం కోసం ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధం అవుతోంది. రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తే మంచిదే. దానిని అమలు చేయాలంటే చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారో రారో తెలియదు. ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా దానికి ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది. కనుక మద్యనిషేధం అమలుచేసే అవకాశం మొదట తెదేపా ప్రభుత్వానికే ఇవ్వాలనుకొంటున్నట్లు ప్రకటించేరు కనుక ఆయనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మద్యనిషేధం అమలు చేయిస్తే అందరూ సంతోషిస్తారు.
ఈ నకిలీ మద్యం కేసులో తమ పార్టీ నేతని అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్న రఘువీరా రెడ్డి, మల్లాది విష్ణుకి చెందిన బార్ అండ్ రెస్టారెంటులో త్రాగిన వారు మాత్రమే చనిపోయిన విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు ముందుగా యజమానినే అరెస్ట్ చేయడం సహజం. రాజకీయనాయకులు అయిననంత మాత్రాన్న వారికి మినహాయింపు ఇవ్వాలని లేకుంటే కక్ష సాధింపు చర్యలుగానే భావిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
అసలు ఈ నకిలీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రంలో నకిలీ మద్యం ఎక్కడయినా తయారవుతోందా? లేదా మల్లాది విష్ణు చెపుతున్నట్లు కూలర్ లోని నీళ్ళలో ఎవరయినా విషం కలిపారా? లేకపోతే ఇంకా వేరే ఏవయినా కారణాలున్నాయా? అని కనుగొనవలసి ఉంది. అలాగే ఈ కల్తీ మద్యం కేవలం కృష్ణా జిల్లాకే పరిమితం అయిందా..లేక రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు కూడా సరఫరా అయ్యిందా? అనే విషయం కనుగొనవలసి ఉంది. రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో ఇటువంటి సంఘటనలు జరుగకుండా ముందే రాష్ట్ర వ్యాప్తంగా తణికీలు చేపట్టడం మంచిది. ఇటువంటి సమయంలో సమస్యను రాజకీయం చేయడం కంటే సమస్యకి కారణాలు, దాని పరిష్కారానికి అందరూ కృషి చేస్తే బాగుంటుంది.