గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ల పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. చివరి దాకా అభ్యర్థులను ప్రకటించడానికి కూడా కొన్ని పార్టీలు భయపడ్డాయి. తెరాస మాత్రమే రెండు రోజుల క్రితం 60 మంది అభ్యర్థులను ప్రకటించింది. పోటీ ఎక్కువగా ఉన్న డివిజన్లలో అభ్యర్థులను ప్రకటిస్తే రెబెల్స్ బెడద మొదలవుతుందని అన్ని పార్టీలతో పాటు అధికార పార్టీకీ భయం పట్టుకుంది. అందుకే, వీలైనంత వరకు సమయం ఇవ్వని విధంగా విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన జరిగింది. కాంగ్రెస్ కూడాఅదే పని చేసింది.
టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రకటన హిచ్ కాక్ సినిమా అంత సస్పెన్స్ ను పండించింది. అసలు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది తేలడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఈలోగా ఎవరికి వారు నామినేషన్లు వేసేశారు. టీడీపీ దాదాపు నామినేషన్ల గడువు ముగిసే సమయానికి జాబితాను ప్రకటించింది. బీజేపీ అయితే అసలు జాబితానే ప్రకటించలేదు. మొత్తానికి ఎవరికి వారుగా నామినేషన్లు వేసిన వారు బి ఫారాలు సమర్పించడానికి గడువు ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు.
బహుశా చరిత్రలో తొలిసారిగా అభ్యర్థుల జాబితా ప్రకటనకు పార్టీలు ఇంతగా భయపడ్డాయి. రెబెల్స్ బెడద, అసమ్మతి ఎన్నికల వేళ మామూలే. అలిగిన వారిని బుజ్జగించడం, అయినా కొందరుతిరుగుబాటు చేయడం కొత్తేమీ కాదు. రాజకీయ పార్టీలకు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడం కూడా కొత్త కాదు. అయినా, రెబెల్స్ బెడదకు ఇంతలా హడలిపోవడం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. ఒకవేళ వేరేపార్టీలో టికెట్ రాని వారికి అప్పటికప్పుడు మరో పార్టీ వారు ఇస్తే అదే పెద్ద సమస్య అవుతుంది. అభ్యర్థి వదిలేసిన పార్టీ కంటే టికెట్ ఇచ్చిన పార్టీకే సొంత కేడర్ నుంచి తలనొప్పితో తల బొప్పి కడుతుంది. కాబట్టి, మరీ ఆగమేఘాల మీద అవతలి పార్టీకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇండిపెండెంట్లుగా పోటీ చేసినా ఎక్కడో అరుదుగా తప్ప, పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి చాలా తక్కువ. అయినా ప్రధాన పార్టీలన్నింటికీ రెబెల్స్ భయంతో గుండెలు గుభేల్ మంది.
ఆఖరి నిమిషంలో పొత్తు ఖరారైనప్పటికీ అభ్యర్థులను ప్రకటించడం కష్టమేమీ కాదు. కానీ ఎందుకో కమలనాథులు ఆ పని చేయలేదు. నామినేషన్లు వేసిన వారిలో తాము ఎంపిక చేసిన వారికి తాపీగా బి ఫారాలు ఇవ్వవచ్చు. కానీ ప్రకటనే చేయకపోవడమే ఆశ్చర్యం. అంతటి స్థాయిలో బీజేపీ టికెట్లకు పోటీ ఉందా? పార్టీ భయపడే స్థాయిలో తిరుగుబాటు బెడద పొంచి ఉందా? క్రమశిక్షణ అనేది లోపించిందా? అనేక ప్రశ్నలు. ఏది ఏమైనా టీడీపీ, బీజేపీలు సమన్వయంతో పనిచేసి మెజారిటీ డివిజన్లను గెల్చుకుంటామంటున్నాయి. తెరాస కూడా ధీమాగా ఉంది. కాంగ్రెస్ నేను సైతం అని పోటీ పడుతోంది. ఇక ప్రచార పర్వం ఏ స్థాయిలో హోరెత్తుతుందో చూద్దాం.