తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. తెలంగాణలో ప్రత్యక్షపోరాటం ప్రారంభించింది. ఏపీలో.. ట్రేడ్ మార్క్ రాజకీయాలకు తెర తీసింది. రెండు రాష్ట్రాల్లోనూ.. మిత్రపక్షాల్లాంటి పార్టీలే అధికారంలో ఉన్నాయి. కానీ… బీజేపీ కమ్ముకొస్తున్న తీరు చూసి.. ఆ పార్టీలు వణికిపోతున్నాయి. ఓ అధికారపార్టీ రియలైజ్ అయి… స్టాండ్ మార్చుకోగా… మరో అధికార పార్టీ.. మార్చుకోలేక తంటాలు పడుతోంది.
తెలంగాణలో బీజేపీ భిన్నమైన గేమ్ ప్లాన్..!
భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ టూర్‌కి వచ్చి వెళ్లిన తర్వాత.. టీఆర్ఎస్ నేతలు… ప్రెస్‌మీట్ పెడితే.. ..కమలం పార్టీపై శివాలెత్తుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర్నుంచి.. ప్రతి ఒక్కరూ బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్కు దడ పుట్టించేలా ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం మారింది. సాగునీటి ప్రాజెక్టులు…మిషన్ భగీరథ, కాకతీయలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేయడంతో మున్ముందు ఏదో జరగబోతోందనే అనుమానం టీఆర్ఎస్లో మొదలైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ విమర్శలు గుప్పిస్తోన్న బీజేపీ.. న్యాయ స్థానాల ద్వారా పోరాటం చేస్తామని చెప్పటం.. గులాబీ నేతల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
వచ్చే నెల నుంచి మరో రేంజ్ రాజకీయం..!
మిషన్ 2023 అంటూ…. తెలంగాణలో బీజేపీ నేతలు కొద్ది రోజులుగా… హంగామా చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్నప్పుడు.. టీఆర్ఎస్ భవన్లో రోజూ ఎలా చేరికల కార్యక్రమం జరిగేదో… ఇప్పుడు.. బీజేపీ నేతలు ఆ స్థాయిలో… నేతల్ని చేర్చుకుంటున్నారు. తమ పార్టీలో చేరబోతున్నారంటూ… ప్రముఖ నేతలతో.. ఆడుతున్న మైండ్ గేమ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటోంది. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ పై ఈ ఎటాక్ ను.. బీజేపీ మరో రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పటికే … ఆరెస్సెస్ గ్రామస్థాయిలో బీజేపీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది. ఇప్పటికే..తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్న బీజేపీ… వచ్చే నెల నుంచి మరో స్థాయికి తీసుకెళ్లనుంది. తెలంగాణ విమోచన దినోత్సవం.. ఆ పార్టీకి మరో సెంటిమెంట్ పరంగా కలసి వచ్చే అంశం. బీజేపీ మార్క్ జాతీయ భావోద్వేగం పెంచుకునే అవకాశం దానితో లభిస్తోంది.
ఏపీలో ఊహించని విధంగా హిందూత్వ వ్యూహం..!
భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కార్యాచరణ ప్రారంభించేసిన సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా.. జరుగుతున్న పరిణామాలతోనే ఇది నిరూపితమవుతోంది. మొదట.. ఆలయాలు అన్యమతస్తులకు కేంద్రాలుగా మారాయనే ఆరోపణలతో బీజేపీ కలకలం రేపింది. శ్రీశైలంలో గత నాలుగు రోజుల నుంచి ఉద్రిక్తంగానే ఉంది. ఇక దుర్గగుడి వివాదం, గోశాల అవుల మృతి విషయంలో.. బీజేపీ నేతలు హడావుడి చేశారు. జగన్ కు హిందూ విశ్వాసాల పట్ల నమ్మకం లేని చెప్పేందుకు అమెరికాలోని.. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమ ఆరంభ సూచికగా చేయాల్సిన జ్యోతి ప్రజ్వలను.. చేయలేదు. ఈ విషయాన్ని బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తిరుమల బస్ టిక్కెట్ల వెనుక జెరూసలెం వ్యవహారం… చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
జగన్ నిస్సహాయతే బీజేపీ బలం..!
జగన్ క్రిస్టియానిటీ నేపధ్యాన్ని బీజేపీ తన బలోపేతానికి ఉపయోగించుకుంటూడటంతో.. వైసీపీ నేతలకు.. ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేరుగా బీజేపీని విమర్శించలేరు. ఆ లైసెన్స్ ఇంకా.. వైసీపీ నేతలకు రాలేదు. భారతీయ జనతా పార్టీ… తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన విజన్ తోనే ఉంది. ఆ విషయం… మిత్రపక్షాలుగా నిన్నమొన్నటిదాకా ఉన్న రెండు రాష్ట్రాల అధికార పార్టీలకూ తెలిసిపోయింది. ఓ పార్టీ ముఖాముఖి పోరుకు సిద్ధమైపోయింది. మరో పార్టీ మాత్రం…అలాంటి అవకాశం లేక… బీజేపీ ఏమన్నా… పడుతోంది. పోరాడకుండా లొంగిపోయే పార్టీ ఉన్నప్పుడు.. రెండో రాష్ట్రంలో కూడా… బీజేపీకి తిరుగేమి ఉంటుంది..?
విపక్షాలు మేలుకోవాల్సిందే..!
ఇప్పటికీ విపక్ష పార్టీలు మాకు మత రాజకీయం పడదని.. తమది అభివృద్ధి మంత్రమని చెబుతూ .. తమను తాము మోసం చేసుకుంటూ ఉంటాయి. కానీ.. అసలు విషయం బోధపడేసరికి.. మత రాజకీయాలు చేద్దామన్నా… పట్టింటుకునేవారు ఉండరు. ఇప్పుడు అభివృద్ధి.. సంక్షేమం.. ప్రజల దృష్టిలో లేవు. భావోద్వేగాలే కీలకం. వాటిని ఒడిసి పట్టుకునేవారిదే రాజకీయం..!