తెలంగాణ సీఎం కేసీఆర్ పని అయిపోయిందని… తాము గ్రౌండ్లో పట్టు సాధించాలని అనుకుంటున్న ఢిల్లీ నేతల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఏప్రిల్ నుంచి ఢిల్లీ ప్రముఖ నేతల గురి తెలంగాణపైనే ఉండనుంది. బీజేపీ అధ్యక్షుడు కాకపోయినా బీజేపీ మొత్తాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణపై ప్రత్యేకంగా గురి పెట్టారు. ఆయన తెలంగాణలో ఏప్రిల్లో రెండు సార్లుపర్యటించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓ సారి బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ప్రారంభోత్సవానికి వస్తారు. మరోసారి శ్రీరామనవమి రోజు ఆధ్యాత్మిక రాజకీయ యాత్రకు వచ్చే అవకాశం ఉంది. రాముల వారిని దర్శించుకోవడంతో పాటు భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది. ఏప్రిల్లో అమిత్ షా తెలంగాణ మిషన్ చాలాస్పష్టంగా అందరికీ వివరిస్తారని.. కార్యాచరణ ప్రారంభమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు రాజకీయాలకు సిద్ధమైంది. రేవంత్ రెడ్డి .. ఏటికి ఎదురీదుతూ.. కాంగ్రెస్ పార్టీనిలైవ్లో ఉంచుతున్నారు. ఏప్రిల్లో ఆయన భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులతో ఓ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఈ సభకు… రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. తాను పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి బలప్రదర్శన లాంటి సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాహుల్ టూర్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెలలో మాత్రం ఎలాగైనా ఆయనను రప్పించాలని భావిస్తున్నారు.
ఇక కేజ్రీవాల్ లాంటి నేతలు కూడా తెలంగాణపై దృష్టి సారించారు. ఆమ్ ఆద్మీ తొమ్మిది రాష్ట్రాల్లో పాతుకుపోయే చాన్స్ ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకుని వాటికి ఇంచార్జుల్ని నియమించారు. ఆ తొమ్మిది రాష్ట్రాల్లోతెలంగాణ ఉంది. స్వయంగా కేజ్రీవాల్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఏప్రిల్ పద్నాలుగున తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. అదే రోజున అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
అన్ని వైపుల నుంచి టీఆర్ఎస్కుసెగ తగలబోతోంది. టీఆర్ఎస్ కు కూడా ఏప్రిల్ నెల ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతకు ఎదురీదుతున్న టీఆర్ఎస్.. ఆ జాతీయ నేతల రాజకీయాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంది.