నవంబర్ 26 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు పార్లమెంటులో ప్రస్తావించవలసిన అంశాలను ఖరారు చేసుకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుని యుద్ద ప్రాతిపదికన నిర్మాణం తదితర అంశాల గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని వైకాపా నిర్ణయించుకొంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడితో ఈ అంశాల గురించి మాట్లాడాలనుకొంటున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీలు రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు,ముఖ్యంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి ఈ సమావేశాలలో ప్రస్తావించవచ్చును.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ఒక్క సభ్యుడు కూడా లేడు కనుక ఆ పార్టీ ఈ సమావేశాల గురించి ఆలోచించనవసరం లేదు.
తెలంగాణాలో తెరాస కేంద్రం పట్ల ఎప్పుడూ అనిశ్చిత వైఖరినే ప్రదర్శిస్తుంటుంది. కొన్ని రోజులు ప్రధాని మోడికి, కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా, మరి కొన్ని రోజులు బద్ద శత్రువులా వ్యవహరిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా తెలంగాణాకు కేవలం 10,000 ఇళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 2 లక్షల ఇళ్ళు కేటాయించడంపై గుర్రుగా ఉన్న తెరాస ప్రభుత్వం ఈసారి కేంద్రప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతోంది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న ఈ పక్ష పాత వైఖరి గురించి పార్లమెంటు సమావేశాలలో కేంద్రాన్ని తప్పకుండా నిలదీస్తామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. ఇదికాక ఏడాదిన్నరగా పెండింగులో ఉన్న హైకోర్టు విభజన, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, నిధుల విడుదల వంటి అనేక ఇతర అంశాలను ప్రస్తావించబోతున్నారు.