ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకుంటోంది. నత్త నడకన సాగుతున్న ప్రాజెక్టు పనులు ఓ కొలీక్కి వచ్చాయి. దీంతో నగరమంతా ఒకటే హడావుడి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రోరైలు ప్రారంభం కాబోతోంది. ప్రారంభ సన్నాహాకాలు ఒకవైపు జోరుగా జరుగుతుంటే… రాజకీయ పార్టీల హడావుడి మరోవైపు! మెట్రో రైలు పూర్తిచేసింది మేమే అని ఒక పార్టీ నేతలు మైకులు అదరగొడుతుంటే… అబ్బే, దానికి శంకుస్థాపన చేసేంది మేము అంటూ మరో పార్టీ గోల..! అబ్బబ్బే… ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నిధులు ఇచ్చింది మేము అని ఇంకో పార్టీ డప్పు పట్టుకుంటోంది. ఎవరిగోల వారిది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం తెరాస అధికారంలో ఉంది కాబట్టి, హైదరాబాద్ లో మెట్రో పనులు పరుగులు తీయించిన ఘనత మా కేసీఆర్ సర్కారుదే అని వారు ఓ రేంజిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో భారీ ఎత్తున హోర్డింగులు పెట్టేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికొస్తే… నగరానికి గ్లోబల్ సిటీగా గుర్తింపు తెచ్చింది తామే అంటూ వారూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు అనేది తెలంగాణ ప్రజల ప్రాజెక్టు అనీ, దీన్ని తామే సాధించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాస సర్కారు తీరు వల్లనే మెట్రో రైలు మరింత ఆలస్యమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్తగా ఒక్క మీటరుకు కూడా అనుమతి రాలేదనీ, మెట్రో రైలు డిజైన్ చేసిందీ, అనుమతులు తెచ్చిందీ, ప్రారంభించింది కూడా కాంగ్రెస్ హాయంలోనే అనే విషయం ప్రజలకు తెలుసు అన్నారు. ఇదొక్కటే కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. అంతేకాదు, హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
ఇక, భాజపా విషయానికొస్తే.. హైదరాబాద్ కు వస్తున్న ప్రధాన నరేంద్ర మోడీ, రాష్ట్ర భాజపా నేతలకు ఓ పదిహేను నిమిషాలు టైమ్ ఇచ్చారు. ఈ సమయం చాలన్నట్టుగా వీరు ఓ వేదికను ఏర్పాటు చేసేశారు. ఆ వేదిక మీద మోడీకి సన్మానం చేస్తున్నారు. ఈ తక్కువ సమయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారనే ఆశాభావాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందనీ, రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం విరివిగా నిధులు ఇస్తోందంటూ… అంతర్లీనంగా మెట్రో రైలు పూర్తి కావడానికి తాము కూడా కృషి చేశామన్నట్టుగా వారి ధోరణి ఉంది. మెట్రో రైలు ప్రారంభం వెనక.. తమ కృషి ఉందని ప్రజలకు చెప్పుకోవడం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా క్రెడిట్ గేమ్..!