ఓ వైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రారంభమయింది. రాజకీయం కూడా అదే స్థాయిలో ఊపందుకుంది. ఈ అంశాన్ని హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అన్ని పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం చేతల ద్వారా… ప్రతిపక్షం మాటల ద్వారా.. హజూర్ నగర్ ప్రజలను ప్రభావితం చేస్తోందని అంటున్నారు. రాజకీయ పార్టీలన్నీ… మూడు రోజుల కిందటి వరకూ హుజూర్ నగర్ ఉపఎన్నికపై చర్చోపచర్చల్లో మునిగాయి. ఆ నియోజకవర్గంలో ప్రచారం.. పార్టీ నేతల మోహరింపు.. పోలింగ్ వ్యూహాలే హైలెట్ అయ్యేవి. హఠాత్తుగా… హుజూర్ నగర్ ఉపఎన్నిక గురించి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరూ ఆర్టీసీ సమ్మె గురించే మాట్లాడుకుంటున్నారు.
ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల గురించే చర్చించుకుంటున్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమన్న సంకేతాన్ని ప్రభుత్వం పంపుతోంది. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్న వాదనను ప్రతిపక్షం తెరపైకి తెచ్చింది. కేసీఆర్ను నియంత్రించాలంటే.. హూజూర్నగర్లో టీఆర్ఎస్ను ఓడించాల్సిందేనని పిలుపునిపిస్తున్నారు.. రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన కేసీఆర్… ఆర్టీసీ విషయంలో అంత ఘాటుగా వ్యవహరించడానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక కూడా ఓ కారణం అని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజలపై సాధారణంగా కాస్తంత వ్యతిరేకత ఉంటుంది. లంచాలు తీసుకుంటారని… తాము కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ తమను వేధిస్తూంటారని సామాన్య ప్రజలకు ఓ అభిప్రాయం ఉంది. కేసీఆర్ దీన్ని గుర్తించారు. ఉద్యోగుల్ని మంచి చేసుకునేదుకు వారికి తాయిలాలు ప్రకటించడం కన్నా… వారి విషయంలో కఠినంగా ఉండి ప్రజల మద్దతు పొందడం సులువని అంచనా వేసుకున్నారని చెబుతున్నారు. వారి విషయంలో కేసీఆర్ కరెక్ట్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని ప్రజలకు కల్పించే ప్రయత్నం చేశారు. ఇది హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ప్రజల నుంచి తమకు మద్దతు లభించడానికి ఉపయోగపడుతుందని.. ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే వ్యూహంలో టీఆర్ఎస్ ఉందని గుర్తించిన కాంగ్రెస్.. తెలంగాణ ఉద్యమంలో వారు పోషించిన పాత్రను గుర్తు చేస్తూ… ప్రజల్లో వారిపై సానుభూతి పెంచేదుకు ప్రయత్నిస్తున్నారు. వారి కోసం పోరాడుతున్న తమకు ప్రజల మద్దతు లభించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు… ఆర్టీసీ కార్మికులను ఒప్పించేందుకు అప్పట్లో కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో అన్నింటినీ బయట పెడుతున్నారు. కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారం ఉందని నియంతలా మారిపోయారని.. హుజూర్ నగర్లో ఓడిస్తేనే కేసీఆర్ దారిలోకి వస్తారని.. కాంగ్రెస్ నేతలంటున్నారు.