తనను ప్రశ్నించడాన్నే అధికారంలో వున్న తెలుగుదేశం సహించ లేకపోతోంది. తాను ఓడిపోవడాన్ని ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. ఈ దృక్ఫధాల నుంచే వ్యవహరిస్తూ సమస్యలకు మూలాల్లోకి వెళ్ళాలన్న స్పృహను రెండు పార్టీలూ కోల్పోయాయి. ఇందువల్ల తమను గెలిపించి శాసన సభకు పంపిన ప్రజల్ని రెండు పార్టీలూ ప్రతీ సమావేశంలోనూ చిత్తు చిత్తుగా ఓడించేస్తున్నాయి.
ఈ సారి ”కాల్ మనీ” విషయంలో ప్రజలు ఓడిపోయారు. పేదల కష్టాన్ని జలగల్లా పీల్చేసే రోజు వారీ, వారం వారీ వడ్డీ వ్యాపారులు లేని నగరాలు, పట్టణాలు, పల్లెలూ లేవు. బాకీపడిన కుటుంబాల్లో ఆడవాళ్ళని లైంగికంగా వాడుకుని వ్యభిచారం చేయిస్తున్న అమానుషం విజయవాడలోనే బయటపడింది. ఇందులో ధుర్యోధనులు, దుశ్శాసనులు, కీచకులు, తెలుగుదేశం వారే కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి ప్రధానంగా ఆత్మరక్షణమీదే పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు జరిగాయి. ఏ పార్టీలో ఎందరెందరు కాల్ మనీ వ్యాపారులు వున్నారో అంకెలు బయటికి వచ్చాయి.
విజయవాడలో కాల్ మనీ వ్యాపారులు చేయించిన వ్యభిచారం మరెక్కడా లేదు. తన పార్టీలో కంటే జగన్ పార్టీలోనే హెచ్చుమంది కాల్ మనీ వ్యాపారులు వున్నారని ఊరూరూ తిరిగి చెప్పుకోడానికి తెలుగుదేశం పార్టీకి అంకెలు అయితే దొరికాయి కాని, విజయవాడలో కాల్ మనీ వ్యాపారులు తమ వ్యాపారంలో వ్యభిచారాన్ని కూడా కలిపేసిన రాక్షసత్వం తెరవెనక్కిపోయింది. ఆవేశాన్ని నియంత్రించుకోలేని జగన్ పార్టీ ఎమ్మెల్యే రోజా ధోరణిని తెలుగుదేశం బాగా వినియోగించుకుంది. ఏడాదిపాటు ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ద్వారా ఆమె పట్ల తనకు ఎంత ఇబ్బంది వుందో, ఎంత ఆందోళన వుందో కూడా తెలుగుదేశం బయటపెట్టుకుంది. మొత్తం ఈ తతంగం పూర్తయ్యే సరికి అసలు సమస్య ”కాల్ మనీ” మాయమైపోయింది.
కాల్ మనీ పుట్టు పూర్వోత్తరాల గురించి, మూలాల గురించి శాసన సభలో చర్చించివుంటే పరిష్కారాలు దొరికివుండేవి. అవి ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలై ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టలు పెంచి వుండేవి.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ చితికిపోతూండటంతో ఏదో పని చేసుకుని బతకడానికి పట్టణప్రాంతాలకు వలసలుపోతున్న పేదలు రోజువారీ అవసరాలకోసం, విరుచుకుపడే అనారోగ్యసమస్యల కోసం, సాయంత్రం వరకూ రోడ్డుమీద అమ్ముకునే చిన్నవ్యాపారాల్లో సరుకుకొనే పెట్టుబడులకోసం వలస వచ్చిన వారికి, పేదలకు డబ్బు సమకూర్చుకోవడం ప్రధాన సమస్య. ఆ సమస్య తీర్చడానికి రోజువారీ వడ్డీ వ్యాపారులు, కాల్ మనీ వ్యాపారులు పుట్టుకొచ్చారు. వడ్డీ రూపంలో పేదల కష్టాన్ని పీల్చేసే పరాన్నజీవులయ్యారు. దుబాయ్ శీను సినిమాలో హీరో బృదానికి పావ్ బాజీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టి సాయంత్రానికి డబ్బు లాగేసే కృష్టభగవాన్ రోల్ ఒక కాల్ వ్యాపారిదే. విజయవాడలో దీనికి వ్యభిచారాన్ని కూడా జత చేయడంతో కాల్ మనీ వ్యాపారులకు డాఫర్లు అనే కొత్త రోల్ కూడా యాడ్ అయ్యింది.
ఈ సమస్యమీద ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే పరిష్కారం అసాధ్యమేమీ కాదు. వడ్డీ వ్యాపారులకు లైసెన్సులు సమంజసమైన వడ్డీ నిర్ణయించి వడ్డీ వ్యాపారుల పేర్లు వివరాలు వడ్డీ రేటు పారదర్శకంగా వుంచి పేదల్ని ఆదుకోవచ్చు. పేదలకు సాయపడాలి అన్న ఆలోచన ప్రతిపక్షానికి వుంటే ఇంకా మెరుగైన సలహాలు సూచనలను సభలో ప్రవేశపెట్టవచ్చు. పొరుగునే వున్న తమిళనాడులో కాల్ మనీ వ్యాపారం పేదలకు ఎంతో సహాయకారిగా వుందని చెబుతున్నారు. ఆ పరిస్ధితులను అధ్యయనం చేసి, బాగుంటే అవే పధకాలను ఆంధ్రప్రదేశ్ కు కుదిరేలా కస్టమైజ్ చేయవచ్చు.
నాయకుడు ప్రజలకు దగ్గరగా వుండాలి,అందుబాటులో వుండాలి, కఠినంగా కూడా వుండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కాఠిన్యం లేదు. ఈ లక్షణాలు ప్రజల కంటే స్వార్ధ పరులకే ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. సిఎం మా వాడే అని చెప్పుకోడానికి తెగబడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కాల్ మనీ వ్యవహారాన్ని పోలీసు శాఖకే విడిచిపెట్టి వుంటే వారు విజయవాడలో కాల్ మనీ డాఫర్ల తాటతీసి వుండేవారు. కానీ, ఇందులో కూడా చంద్రబాబే చొరబడిపోయి సమస్యను రాష్ట్రవ్యాప్తం చేయడంతో నేరం పలచబడిపోయింది. సమంజసంగా వ్యాపారం చేసుకునే వడ్డీవ్యాపారులు అప్పులివ్వడం తాత్కాలికంగా అయినా ఆపేశారు. డాఫర్ కాల్ మనీ వ్యాపారులకు మాత్రం బెయిళ్ళు మంజూరౌతున్నాయి.