కదిలేది కదిలించేది పెనునిద్దుర పెను నిద్దుర వదిలించేది కవిత్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో ఈ పని చేస్తున్నదెవరు? కేసీఆరే కదా. భవిష్యత్తులో, ఇంకా చెప్పాలంటే త్వరలోనే ముఖ్యమంత్రిగా కదిలేది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రి కేటీఆర్ అయితే ఆయన్ని ముందుకు నడిపించే చలన శక్తి కేసీఆర్. కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని, ఇది పక్కా సమాచారమని కథనం రాసిన పాపులర్ ఆంగ్ల పత్రిక ఈరోజు దానికి కొనసాగింపుగా మరో కథనం రాసింది. ఈ సమాచారం కూడా సీఎం కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెప్పిందేనట…!
ఇంతకూ అసలు విషయం ఏమిటంటే…కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారు. కాని ఆయన్ని నడిపించేది మాత్రం కేసీఆరే. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ని తండ్రి ఎలా నడిపిస్తాడు? కొడుకును డమ్మీ ముఖ్యమంత్రిగా చేస్తాడా? అలా ఎందుకు చేస్తాడులెండి. కేటీఆర్ తక్కువోడు అనుకుంటున్నారా? తండ్రి లక్షణాలు ఆయనలో చాలా ఉన్నాయి. తండ్రి మాదిరిగానే మాటకారి. అడ్మినిస్ట్రేటర్. రాజకీయ చతురత ఉన్నోడు. ఈ లక్షణాలు లేకుంటే ముఖ్యమంత్రిని చేయాలని తండ్రి ఎందుకు అనుకుంటాడు? అయితే మంత్రిగా వ్యవహరించడం వేరు, ముఖ్యమంత్రిగా వ్యవహరించడం వేరుకదా. ప్రభుత్వ ఇమేజీ డామేజీ కాకుండా చూసుకోవాలి.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలి. దీటుగా సమాధానాలు ఇవ్వాలి. తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోగలగాలి. ఇలా చాలా చాలా చేయాల్సివుంటుంది. కాబట్టి కేటీఆర్ ముఖ్యమంత్రిగా పీఠం మీద ఉన్నా మొత్తం కథ కేసీఆర్ కనుసన్నల్లోనే సాగుతూ ఉంటుంది. మరి ఇందుకు కేసీఆర్ ఏం చేస్తారు? కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ అధ్యక్షుడిగా ‘తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్’ (తెలంగాణ రాష్ట్ర సలహా మండలి) ఏర్పడుతుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పట్లో కాంగ్రెసు అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్పర్సన్ అయిన సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పడిన సంగతి తెలిసిందే కదా.
వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్లూ యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించింది సోనియా గాంధీయే. ఇది బహిరంగ రహస్యమే. అప్పట్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సోనియా గాంధీ ‘ఎస్’ అనాల్సిందే. అందుకే తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వమైనా ఎవరూ అలా అనరు. సోనియా గాంధీ ఇచ్చిందంటారు. సరే…కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సోనియా గాంధీ మాదిరిగానే వ్యవహరిస్తారన్నమాట. తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉంటారు కదా. ఇందులో సీఎంగా వుండే కేటీఆర్, కొందరు ముఖ్యమైన మంత్రులు సభ్యులుగా ఉంటారు.
ఇక ప్రస్తుత రాష్ట్ర ప్లానింగ్ బోర్డు (ప్రణాళికా సంఘం) డిప్యూటీ ఛైర్మన్ బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారైన రాజీవ్ శర్మ కూడా అడ్వైజరీ కౌన్సిల్లో కీలకంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకోవాలనుకునే ఏ నిర్ణయమైనా సరే ముందుగా కౌన్సిల్ పరిశీలిస్తుంది. చర్చిస్తుంది. సవరణలు సూచిస్తుంది. సలహాలు ఇస్తుంది. అది ఓకే అన్న తరువాతే ప్రభుత్వం దాన్ని ప్రకటిస్తుంది. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్‌కు ఏ మంత్రినైనా, ఏ ఉన్నతాధికారినైనా పిలిచి మాట్లాడే అధికారం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అడ్వైజరీ కౌన్సిల్ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ తన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే పరిపాలన సాగిస్తారు. మరి ఇందంతా ఊహాగానమా? నిజంగానే ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయా? పొగ వస్తోందంటే నిప్పు ఉన్నట్లేనా?