ఇప్పటికి మెడ వరకే మునిగింది.. పూర్తిగా మునగండి అని టాలీవుడ్ ను ముందుకు తోస్తోంది రాజకీయం. సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయం కాకపోతే వైసీపీ, బీఆర్ఎస్ జోక్యం చేసుకోకపోతే .. అల్లు అర్జున్‌కు అప్రకటిత మద్దతు ప్రకటించకపోతే విషయం ఇక్కడి వరకూ వచ్చేది కాదు. తెలిసో తెలియకో.. తాను ట్రాప్ లో పడిపోతున్నానని గుర్తించలేకో కానీ రాజకీయం అనే అడుసును తొక్కేసిన అల్లు అర్జున్ ఇప్పుడు టార్చర్ అనుభవిస్తున్నారు. ఆయన చేతుల నుంచి జారిపోయింది. ఆయన భవిష్యత్ ను రాజకీయ పార్టీలు చేతుల్లో కి తీసుకుని రాజకీయం చేస్తున్నాయి.
ఇప్పుడు ఆయన నుంచి .. మొత్తం టాలీవుడ్ ను పావుగా వాడుకునేందుకు రాజకీయం ప్రారంభించింది. అంతా కలిసి ప్రభుత్వంపై తిరగబడండి అని సలహాలిస్తూ రెచ్చిపోతున్నారు. నిన్న నాగార్జున ఇవాళ అర్జున్.. రేపు మీరే అంటూ ఇండస్ట్రీ వాళ్లను బయటకు రావాలని పిలుపునిస్తున్నారు. నిజంగా రేపు మీరే అని ఎవరికైనా అనిపిస్తే వారు రోడ్డు మీదకు రారు… తెర వెనుక ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలో అలాంటి ప్రయత్నాలు చేసుకుంటారు. టాలీవుడ్ అనేది అద్దాల మేడ. అందులో ఉండే వారు అక్కడ కూర్చుని రాళ్లేసుకుంటే పగిలేది వారి మేడ. ఎదుటివారిని రెచ్చగొట్టినా వాళ్లు రాళ్లు వేస్తే తగిలేది టాలీవుడ్ అద్దాల మేడే. ఈ విషయం తెలుసు కాబట్టే అందరూ సైలెంటుగా గా ఉంటూ వస్తున్నారు.
కానీ టాలీవుడ్ రోడ్డు మీద పడేసేందుకు రాజకీయం గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతంలో తాము చేసిన సాయాలను గుర్తు పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడాలని ఒత్తిడి కూడా చేస్తున్నారు. ఎలా చూసినా రాజకీయంతో రాసుకుపూసుకు తిరిగిన వారంతా రెండు విధాలుగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఒక్క నిరసన స్వరం వినిపించినా రేవంత్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అంతిమంగా టాలీవుడ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.