ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ .. న్యాయవ్యవస్థను.. వివిధ రకాల పద్దతుల్లో.. నియంత్రించాలని చూస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ, చట్ట విరుద్ధమైన నిర్ణయాలన్నీ కోర్టుల్లో తేలిపోతూండటంతో.. అనుకూలమైన తీర్పులు ఇచ్చేందుకు ముందుగా.. కోర్టులపై కులం ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వివిధ రకాల బెదిరింపులు.. ఇతర అంశాల ఆధారంగా… సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారు. కోర్టు కన్నెర్ర చేయడంతో సోషల్ మీడియాలో ఆ తరహా పోస్టులు ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు అధికారిక మీడియా నుంచే ఆ ప్రచారం ప్రారంభించడం అనూహ్యంగా మారింది.
అధికార పార్టీ రాజకీయ వ్యూహం పూర్తిగా ప్రచారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఓ వ్యక్తిని లేదా.. వ్యవస్థను.. టార్గెట్ చేయాలనుకున్నప్పుడు.. ముందుగా అతనిపై అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా దుష్ప్రచారం చేస్తారు. లొంగితే సరే.. లొంగకపోతే… వాటిని మరింత ఉద్ధృతం చేస్తారు. ప్రస్తుతానికి పార్టీ మారిన అనేక మందికి ఇదే తరహా ట్రీట్ మెంట్ చేశారు. మేధావులు.. తటస్తుల పేరుతో కొంత మందిని తెరపైకి తెచ్చి వ్యూహాత్మకంగా లేఖలు రాయించి.. వాటిని సొంత మీడియాలో హైలెట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాపై కుమ్మరిస్తున్న కోట్లు.. సొంత మీడియాతో ఇదే తరహా రాజకీయం నడిచింది. ఎన్నికలకు ముందు నుంచి.. ప్రత్యర్థి పార్టీపై ఈ తరహా రాజకీయం చేసిన అధికార పార్టీ ఇప్పుడు న్యాయవ్యవస్థపైనా అదే ప్రయోగిస్తోంది.
ఇటీవల హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ గుండెపోటుతో చనిపోయారు. ఆయన మరణానికి కారమం చీఫ్ జస్టిస్ అంటూ.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి…. లేఖ రాశారు. ఆ లేఖను … అధికార పార్టీ మీడియాప్రముఖంగా ప్రచురించింది. దాని ఆధారంగా ఆ తర్వాత వెంటనే… స్పీకర్ న్యాయవ్యవస్థ పరిపాలిస్తోందని… వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ.. హైకోర్టు తన విధులను నిర్వహించకుండా.. ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇవ్వాలన్న బ్లాక్మెయిలింగ్లో భాగమేనన్న ఆరోపణలు న్యాయవాద వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ విషయాన్ని సులువుగానే గుర్తించిన భారత న్యాయవాదుల సంఘం… హైకోర్టు సీజేపై చేసిన ఆరోపణల్ని ఖండించింది.
దేశంలో ఎక్కడా లేని విపత్కర రాజకీయ పరిస్థితులు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్రతీ వ్యవస్థపై దాడి జరుగుతోంది. చట్టాలు.. న్యాయాలు.. రాజ్యాంగాలు.. ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎవరైనా చట్ట ప్రకారం వ్యవహరించినా.. తీవ్రమైన వ్యక్తిగత ఎదురుదాడి జరుగుతోంది. ఈ పరిస్థితిని ఇప్పుడు న్యాయవ్యవస్థ కూడా ఎదుర్కొంటోంది.