గంజాయి విషయంలో ఏపీపై దుష్ప్రచారం చేయడానికి చంద్రబాబు కొంత మంది తెలంగాణ పోలీసులతో కుట్ర చేశారని దీనికి ఆధారాలున్నాయని విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఏపీలో అసలు గంజాయే లేదని.. అంతా దుష్ప్రచరమేనని నిరూపించిడానికి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు ఆధారాలివ్వాలని అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా నోటీసులు ఇస్తున్న పోలీసులకు ఇప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పిన పెద్ద మనిషి కళ్ల ముందే ఉన్నారు.
మధ్యాహ్నం ప్రెస్మీట్ పెడితే టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబుకు సాయంత్రం కల్లా నర్సీపట్నం సీఐ బండేసుకుని వచ్చి మరీ ఆధారాల కోసం నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని చెప్పి మరీ ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిని పోలీసులు ఇంత వరకూ ప్రశ్నించలేదు. నోటీసులు ఇవ్వలేదు. కనీసం ఉన్న ఆధారాలు కూడా ఇవ్వాలని అడగడం లేదు. ఏపీ పోలీసులకు ఇప్పుడు నెటిజన్ల నుంచి ప్రధానంగా ఇదే ప్రశ్న వస్తోంది. ఎందుకు ఆధారాలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఏ రాజ్యాంగం కింద పని చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు.
ఏపీ పోలీసులు సామాన్యుల రక్షణ విషయంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారో.. రాజకీయ నేతలకు కొమ్ము కాస్తూ.. నేరుగా చట్టాన్ని రాజకీయాలకు అనువుగా వాడుతూ అంత కంటే దారుణమైన విమర్శలకు గురవుతున్నారు. కోర్టుల్లో పరువు పోతున్నా తుడుచుకుని వెళ్లిపోతున్నారే కానీ సిగ్గుపడటం లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి దగ్గర ఆధారాలు తీసుకోకపోతే.. మరో మచ్చ పడటం ఖాయమని అనుకోవచ్చు.