కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. దశాబ్దాల పాటు నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థల్ని రోజుల్లోనే కుప్పకూల్చేస్తోంది. ప్రజల ఆరోగ్యానికీ గ్యారంటీ లేదు. అయితే…భారత్‌లో మాత్రం ఇంకా డేంజర్ జోన్ రాలేదన్న అభిప్రాయం ఉంది. మూడో దశ ప్రారంభమైతే.. తట్టుకోవడం కష్టమన్న అంచనా ఉంది. మరి ఈ పరిస్థితి రాకుండా.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటున్నాయా అంటే.. ఊహించడం కష్టంగా మారుతోంది.
లాక్డౌన్ చేసేశారు.. కానీ నష్టపోకుండా ఏం చేశారు..!?
కరోనా వైరస్ కు మందు లేదు.. నియంత్రణే మార్గం. ఆ నియంత్రణ ఏమిటంటే… ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్న ఒకే ఒక్క మార్గం.. లాక్ డౌన్. కరోనాకు అందకుండా ఇంట్లోనే ఉండటం. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాదాపుగా లాక్ డౌన్ అయిపోయింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే.. లాక్ డౌన్ వల్ల.. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయన్న ఆందోళన ఉంది. అందుకే లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం ఏమిటన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రజారోగ్యంతో పాటు.. దేశ ఆర్థిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని గుర్తించింది. లాక్డౌన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలన్నదానిపై కసరత్తులు చేస్తున్నారు. కానీ జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు.
సంక్షోభంలోనూ రాజకీయ లాభమే చూసుకుంటున్న పార్టీలు..!
ప్రస్తుతం ప్రపంచం మీద కరోనా మహమ్మారిలా మీద పడుతోంది. దీని బారి నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే.. మరో ఆలోచన లేకుండా.. పూర్తి స్థాయిలోఆ పోరాటం పైనే దృష్టి పెట్టాలి. కానీ ప్రజాస్వామ్య భారతంలో.. ప్రతీది రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. ప్రపంచానికి ఇది వరకెన్నడు ఎరుగని ముప్పు వచ్చినందున రాజకీయ పార్టీలు కూడా..రాజకీయాలను.. నిజమైన అర్థం అయిన.. ప్రజాక్షేమాన్ని చూడాల్సి ఉంది. కానీ కొన్ని పాలక పార్టీలు.. కోరనా వస్తుంది.. పోతుందన్న భావనతో ఉండి.. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రపంచ దుస్థితి కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు రాజకీయాలను దాటి ప్రజల వరకూ ఆలోచించలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. కరోనా మూడో దశ వ్యాప్తి చెందితే.. చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది దేశంలో ప్రారంభమయిందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వాలకు ఉన్న వ్యూహమేంటో అర్థం కాని పరిస్థితి ఉంది.
ప్రజల కోణంలో రాజకీయం చేస్తేనే ప్రయోజనం..లేకపోతే వినాశనం..!
మూడో దశ ప్రారంభమైతే….ఇండియాలో ఉన్న పరిమిత వైద్య సౌకర్యాల కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడాతాయన్న ఆందోళన కూడా చాలా మందిలో వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో లేదు. కేసులు ..రెండు రాష్ట్రాల్లోనూ రోజుకు ఇరవై నుంచి 30 వరకూ నమోదవుతున్నాయి. ట్రావెల్ హిస్టరీ లేకపోయినా…మర్కజ్‌తో లింకులు లేకపోయినా కొంత మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం.. మూడో దశ ప్రారంభానికి సూచికన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ పొడిగింపునకు నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్..లాక్ డౌన్ తీసేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన.. చాలా మందిలో ఉంది. ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తేనే.. ఎంతో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాజకీయనేతలు దీన్ని పాటిస్తారో లేదో..?