పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో బాక్సాఫీసు రికార్డులను సృష్టించిన జోడి. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం కొత్త టర్న్ తీసుకుంది. అప్పటివరకూ వరుస పరాజయాలతో సతమతమౌతున్న కళ్యాణ్ ను త్రివిక్రమ్ రాత తీతా కొత్త పంధాలో నడిపింది. ఇక ‘అత్తారింటికి దారేది’చిత్రం గురించి చెప్పక్కర్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా పైరసీ బారిన పడినా.. ఆ ప్రభావం సినిమాపై ఏ మాత్రం కనిపించలేదు. కలెక్షన్స్ పరంగా అప్పటివరకూ వున్న రికార్డులను ఈ సినిమా తిరగరాసింది.
ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ‘హరిక హాసిని’ చినబాబు ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా కధపై వినిపిస్తున్న కబుర్లు ఆసక్తికరంగా వున్నాయి. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉటుందని, పవన్ పొలిటికల్ మైలేజ్ కు పనికొచ్చేలా ఈ కధను సెటప్ చేస్తున్నారని, పొలిటికల్ డైలాగులు దంచబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కాస్త విచిత్రంగానే వుంది.
త్రివిక్రమ్ అంటే పక్కా వినోదం. నిర్మాత చినబాబు అభిరుచి కూడా ఇదే. ఈ సినిమా ఫైనల్ అయ్యింది కూడా వినోదాత్మక కధతోనే. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ టచ్ అని ప్రచారం జరగడం నమ్మసక్యంగా లేదు. త్రివిక్రమ్ సెన్సిబిలిటీస్ గురించి తెలిసిన ఎవరైనా ఇదే చెబుతారు. తన సినిమాల్లో పర్శనల్ మాటోలను చెప్పించడానికి ఇష్టపడరాయన. సాధ్యమైనంత వినోదం పంచడానికే మొగ్గుచూపుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కోరితే త్రివిక్రమ్ పెన్ను పొలిటికల్ లైన్స్ వైపు వెళ్ళడం పెద్ద విషయం ఏమీకాదు ‘జల్సా’లో ‘నక్సలిజం’ లాంటి సీరియస్ ఇష్యును టచ్ చేసి చివరికి వినోదంతో ముగించేసిన త్రివిక్రమ్.. ఆ రకంగా ఇందులోనూ పొలిటికల్ పంచులను టచ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.