ఆంధ్రప్రదేశ్‌లో ”పొలిటికల్ పంచ్” వెబ్సైట్ నిర్వాహకుడైన ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేయడంలో ఉద్దేశం ఇలాంటి ప్రయత్నాలు చేసే వారిని బెదరగొట్టడమే. తెలుగు మీడియాలో రాజకీయ పక్షాలు, పక్షపాతాల ప్రభావం పెరిగిపోయిందని అనుకుంటున్నదే. ఇప్పుడు సోషల్ మీడియా ఇందుకు పెద్ద సాధనంగా మారిపోయింది. ముఖ్యంగా టిడిపి వర్సెస్ వైసిపి, జగన్ వర్సెస్ చంద్రబాబు, లోకేష్ తరహాలోనే అనేక సైట్లు నడుస్తున్నాయి. ఈ ప్రక్రియలో వైసిపి కొంత ముందంజలో ఉండగా, తెలుగుదేశం కూడా ప్రత్యేక బృందాన్ని తయారు చేసుకుంటున్నది. వాస్తవంగా సోషల్ మీడియా బడా యాజమాన్యాల బెడద లేకుండా ఔత్సాహికులు, సామాజిక కార్యకర్తల భావ ప్రచారానికి, వ్యాఖ్యానాలకు వేదికగా ఉండాలి.
మొదట్లో అలాగే జరిగింది కూడా. కానీ మమతా బెనర్జీ నుంచి చంద్రబాబునాయుడు, ప్రధాని మోడీతో సహా ఈ వేదికపై విరుచుకుపడటం పరిపాటిగా మారింది. ఒక దశలో బిజెపి, ఆర్ఎస్ఎస్ వర్గాలు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అందులోనూ మోడీ అభ్యర్థిత్వానికి మద్దతుగా సోషల్ మీడియాను క్రమపద్ధతిలో ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు అధికారంలోకొచ్చాక వారికి అదే అపరాథంగా కనిపిస్తున్నది. వారి సహవాస దోషం వల్ల కావొచ్చు టిడిపి ప్రభుత్వం కూడా అధికారికంగా సోషల్ మీడియాపై హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ఛానళ్ళు దీనిపై కథనాలే వదిలాయి. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్ అరెస్టు ఆశ్చర్యమేమీ కాదు. ఆయన శాసనమండలిపై వేసిన కార్టూను కారణంగా చూపించడం సాంకేతిక సమర్థనకు తప్ప నిజంగా ఇది రాజకీయ ప్రధానమైనది. ఇప్పుడు అతని వెనుక వైసిపి ఉన్నట్టు చెబుతున్నారు. అలాఅనుకున్నా ముందు హెచ్చరికలు, నోటీసులు లేకుండా అరెస్టు చేయడం న్యాయమా? మొత్తంగా ఎవరివెనుక ఎవరున్నారో శ్వేతపత్రం ప్రకటిస్తే మంచిది కదా!