రాజకీయం. శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు లేని రంగం. ఇక్కడి వారు అక్కడికి… అక్కడి వారు ఇక్కడికి మారేందుకు అవకాశం ఉన్న రంగం. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉన్నంత కాలం ఆ పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడిన వారు కడదాకా ఆయా పార్టీల్లోనే కొనసాగేవారు. తర్వాత తర్వాత ప్రజల కోసం రాజకీయాలు మారిపోయి వ్యక్తిగత అవసరాలే రాజకీయాలుగా చెలామణి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధాంతపరమైన పార్టీలు కూడా తమ సిద్ధాంతాలను తిలోదకాలు ఇచ్చేశాయి. ఇటీవల కాలంలో రాజకీయాలు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ వ్యక్తిగత కక్షలు తీర్చుకునే దిశగా మారిపోయాయి. ఇందులో భాగంగా తాము అధికారంలోకి రాగానే ఆస్తిలపై దాడులు, వివిధ కేసులు నమోదు చేయడం వంటివి పరిపాటిగా మారాయి. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ‘చట్టం తన పని చేస్తుంది’ అంటూ అధికారంలో ఉన్న వారు సమర్ధించుకోవడం పరిపాటిగా మారింది. ఈ వ్యక్తిగత దాడులకు కొత్తగా మరో అంశం చేరింది. అదే ముఖ్య
నాయకుల సెక్యూరిటీని తగ్గించేయడం. దీనికి రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ మినహాయింపు కాదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సెక్యూరిటీని సగానికి సగం తగ్గించేసింది అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతే కాదు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల సెక్యూరిటీని కూడా తగ్గించేశారు. సెక్యూరిటీ తగ్గించేయడం ద్వారా ప్రత్యర్దులలో ఓ మానసిక భయాన్ని పెంచాలన్నది అధికార పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇదే పద్దతి కొనసాగుతుండడం విషాదం. తాజాగా తెలంగాణలో లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి సెక్యూరిటీని తీవ్ర స్దాయిలో తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో తనకు సెక్యూరిటీ పెంచాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా మంత్రులుగా పనిచేసిన వారు ఎన్నికలలో ఓటమి పాలైతే వారి సెక్యూరిటీని కూడా తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనేక వైపుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా కొన్నాళ్లు అధికారంలో ఉన్న వారి పట్ల చాల వర్గాలలో ఆగ్రహం ఉంటుంది. ఇక మావోయిస్టుల హిట్ లిస్టుల సంగతి సరేసరి. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా కక్షపూరిత రాజకీయాలు చేయడం తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న కొత్త సంస్కృతి.