ఇంటర్ ఫలితాల విషయంలో … విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఈ విషయంలో బయటకు వస్తున్న ఒక్కొక్క అంశం.. కలకలం రేపుతోంది. ఒక్కో విద్యార్థిది ఒక్కో వేదన. వారి రెండేళ్ల కష్టాన్ని … చిన్న నిర్లక్ష్యంతో ఇంటర్ బోర్డు విలువలేనిదిగా చేసేసింది. దీనిపై… జరగాల్సింది వేరు. ముందుగా విద్యార్థులకు న్యాయం చేయాలి. కానీ.. ఏం జరుగుతోంది..? మెల్లగా ఆ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించేశారు. ఈ వ్యవహారంపై.. సంబంధిత శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ… దీన్ని రాజకీయం చేయడానికి మాత్రం మొదటి అడుగు వేశారు.
ఆయన విమర్శలకు కౌంటర్‌గా… విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో .. విపక్షాలు రాజకీయానికి బయలుదేరాయి. ఇంటర్ ఫలితాల అంశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది..విద్యార్థులు,తల్లిదండ్రుల ఆందోళనలతో వాతావరణం వేడెక్కింది. విద్యార్థులను ఎలా సముదాయించారో అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయమే బెటరని అనుకున్నట్లుగా ఉంది. ఈ మేరకు మంత్రి.. విపక్షాలపై విమర్శలు ప్రారంభించారు. వారు మంత్రిపై ఆరోపణలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఇక విద్యార్థుల కన్నా…, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకే ఎక్కువ సమయం వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. దీన్ని రాజకీయ అంశంగా మార్చేసి.. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలు, అన్యాయమైపోయిన విద్యార్థుల్ని అలా గాలికి వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గతంలో.. ఎసెంట్ లీకేజీ విషయాన్ని మీడియా బయటపెట్టినప్పుడు కూడా అదే జరిగింది. ఎంసెట్ పరీక్షను తప్పని పరిస్థితుల్లో రద్దు చేసి.. మళ్లీ నిర్వహించారు.. కానీ లీకేజీ నిందితుల్ని మాత్రం ఇప్పటి వరకూ గుర్తించలేదు. ఆ కేసు ఏమయిందో కూడా.. ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంటర్ ఫలితాల వ్యవహారం కూడా అలా మారిపోయినా ఆశ్చర్యం లేదు.