ఎన్నికల ప్రక్రియ మొదలైన ఐదు రాష్ట్రాల్లో అస్సాం మినహా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు,పాండిచేరి లలో బిజెపికి గెలుపు ఆశ లేదు. ఇందులో మొదటి రెండు రాష్ట్రాలు లెఫ్ట్ పార్టీల ప్రాబల్యం వున్నవి కాగా, మిగిలిన రెండూ ద్రవిడ పార్టీల రాష్ట్రాలే!
అస్సాంలో పదేళ్ళనుంచీ కాంగ్రెస్ అధికారంలో వుంది. ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ మీద పెద్దవ్యతిరేకత లేదు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే బిజెపి ఢిల్లీ, బీహార్ ఫలితాల తరువాత ప్రచారశైలిని మార్చింది.ఇందువల్లే మోడీ ఎన్నికల ప్రచారంలో ‘మా పోరాటం పేదరికంపైనే గోగోయ్ మీద కాదు’ అని ప్రకటించారు. 126 స్థానాలున్న అస్సాంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను ఏడు స్థానాలు గెల్చుకుంది. ప్రస్తుతం బిజెపి ఎంపి, కేంద్ర క్రీడలు, యువజన మంత్రి సర్బానంద్ సోన్వాల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో వామపక్షాలకు 30 శాతం, టిఎంసికి 39 శాతం, బిజెపికి 17 శాతం, కాంగ్రెస్‌కు 9 శాతం ఓట్లు వచ్చాయి. అంతే కాక బిజెపి రెండు ఎంపి సీట్లను కూడా సాధించింది. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ముస్లిము ఓట్ల మీద, బిజెపి హిందూ ఓట్ల మీద దృష్టిపెట్టాయి.26 శాతం ఉన్న ముస్లిములకు టిఎంసి, హిందువులకు బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే వాతావరణాన్ని సృష్టించేందుకు తృణమూల్, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయి. అయినా కూడా ప్రతి జిల్లాలోనూ వామపక్షాలు, టిఎంసి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది.
కేరళలో ఎల్డిఎఫ్, యుడిఎఫ్ మధ్యనే ప్రధాన పోటీ వుంటుంది. అక్కడ బిజెపి పాత్ర నామమాత్రమే! గత స్థానిక ఎన్నికల్లో బిజెపి నాల్గవ స్థానంలో నిలిచింది. సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌లో సిపిఐతో పాటు జెడిఎస్, ఐసిఎస్, కెసిజె, కెసిటి, ఎన్‌సిపి, ఐఎన్ఎల్ వంటి పార్టీలున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్‌లో ఇండియన్ ముస్లిం లీగ్, కెసిఎం, కెసిబి, కెసిజె, కెసిఎస్, జెఎస్ఎస్, సిఎంపి, ఆర్ఎస్పి, ఆర్ఎస్పి(బి)లు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో హెచ్చు సీట్లకోసం బిజెపి ప్రయత్నం చేస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిపోయి, సస్పెండైన క్రికెటర్ శ్రీశాంత్‌ను ఆహ్వానించి ఒక్క రోజులోనే సభ్యత్వం ఇచ్చి తిరువనంతపురం ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించింది.
తమిళనాడులో ద్రవిడ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపుతారు. గెలిచిన పార్టీలు కేంద్ర ప్రభుత్వం పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె కేంద్రంలో కాంగ్రెస్ కూటమిలో ఉంది. ప్రస్తుత జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె బహిరంగంగా ఎన్‌డిఎకు మద్దతు ఇవ్వకపోయినా… బిజెపి కష్ట కాలాల్లో ఆదుకునేందుకు ముందుకొస్తోంది.గతంలో లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు ఏడు పార్టీలతో కూటమి కట్టిన బిజెపి కేవలం ఒకే ఒక్క ఎంపి స్థానం (కన్యాకుమారి) గెలిచింది. నాటి కూటమిలోని బలమైన డిఎండికె, పిఎండికె, ఎండిఎంకె పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో వైదొలిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో డిఎంకె, అన్నాడిఎంకె, ప్రజా సంక్షేమ కూటమి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. డిఎంకె కూటమిలో కాంగ్రెస్, ఐయుఎంఎల్, పుదియ తమిళగంలు ఉన్నాయి. అన్నాడిఎంకె కూటమిలో సమత్తువ మక్కల్ కట్చి, తదితర చిన్నా చితక పార్టీలు ఉన్నాయి. ప్రజా సంక్షేమ కూటమిలో సిపిఎం, సిపిఐ, డిఎండికె, ఎండిఎంకె, డిపిఐ, తదితర పార్టీలున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచేరి బిజెపి పాత్ర ఏమీ లేదు. బిజెపి సీనియర్ నాయకులు, ప్రస్తుత కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు ఇక్కడ గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఫలితం రాలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి ఒకే ఒక్క స్థానాన్ని అన్నాడిఎంకె కైవశం చేసుకుంది. అయితేఇపుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి గాలే వీస్తోందనిపిస్తోంది. ఆయన చాలా ప్రాబల్యమున్న నాయకుడు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో రంగస్వామి, కాంగ్రెస్, డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు ప్రధానంగా పోటీ పడనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అపుడే పార్టీ పెట్టి పోటీ చేసిన రంగస్వామికి 15 స్థానాలు, 31 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఏడు స్థానాలు, 25 శాతం ఓట్లు వచ్చాయి.
లోక్‌సభలో బిజెపికి 280 మంది ఎంపిలతో స్పష్టమైన మెజార్జీ ఉన్నా రాజ్యసభలో కేవలం 48 సీట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు 64 మంది, తృణమూల్ కాంగ్రెస్ కు 12 మంది, అన్నాడిఎంకె పార్టీకి 12 మంది, సిపిఎంకు 9 మంది, సమాజ్ వాది పార్టీ (ఎస్పి)కి 15 మంది, బహుజన సమాజ్‌వాది పార్టీ(బిఎస్పి)కి 10 మంది రాజ్యసభలో సభ్యులున్నారు. లోక్‌సభలో ఆమోదం పొంది మెజారిటీ లేక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభలో వీగిపోవడమో, వెనక్కి రావడమో జరుగుతోంది.
2014 సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బిజెపి ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్నది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, తదితర రాష్ట్రాల్లో జరిగిన స్థానిక, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో కూడా పెద్దగా విజయాలు లేవు.
అలాగే ఈ ఎన్నికల ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఓటమి చవిచూస్తే దాని ప్రభావం 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై పడవచ్చు. శాసనసభల్లో పార్టీ బలం పెంచుకోవడం ద్వారా రాజ్యసభ సభ్యుల సంఖ్యను పెంచుకోవడం బిజెపి ఆశిస్తున్న తక్షణ ప్రయోజనమైతే, పెద్దగా ప్రభావం లేని రాష్ట్రాల్లో చిరునామా ఏర్పరచుకోవడం ఆపార్టీ ఆశిస్తున్న రెండో ప్రయోజనం! ఈ ద్విముఖ వ్యూహంతో బిజెపి బరిలో దిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ 4 న మొదలయ్యాయి. మే 16 న ముగుస్తాయి.