ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సుదీర్గ న్యాయపోరాటం చేసి మళ్ళీ తన పదవి దక్కించుకొన్నప్పటికీ, అంతకు ముందు ఆ పదవిని కాపాడుకోవడం కోసం తన పార్టీ ఎమ్మెల్యేకే లంచం ఇస్తుండగా స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు అదే ఆయన పదవిని ఊడగొట్టి జైలుకి కూడా పంపించేలాగుంది. ఆ కేసులో ఇప్పటికే ఆయనను ప్రశ్నించిన సిబిఐ, ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్దపడింది. దానితో ఆయన మళ్ళీ రాష్ట్ర హైకోర్టుకి పరుగులు తీయకతప్పలేదు. ఆ పిటిషన్ న్ని స్వీకరించిన హైకోర్టు ఆయన అరెస్టుని నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ స్టింగ్ ఆపరేషన్ పై సిబిఐ దర్యాప్తుని నిలిపివేయాలని ఆయన చేసిన అభ్యర్ధనను తిరస్కరించింది. ఈ కేసును మళ్ళీ జూన్ 20వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లే.
మళ్ళీ ఇటువంటి సమస్య ఎదురవుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలిసి ఉన్నప్పటికీ, హరీష్ రావత్ నే ముఖ్యమంత్రిగా కొనసాగించడం పొరపాటుగానే కనిపిస్తోంది. అయితే, ఒకవేళ ఆయనను తప్పించి వేరే ఎవరినయినా ముఖ్యమంత్రిగా నియమించినట్లయితే, అప్పుడు ఆయన కూడా భాజపాతో చేతులు కలుపుతారని కాంగ్రెస్ అధిష్టానం భయపడిందేమో? కానీ ఒకవేళ ఇదే పరిస్థితులు ఇంకా ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే, అప్పుడు రావత్ కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలే భాజపాలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. సుప్రీం కోర్టు జోక్యంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ నిలకడ ఏర్పడిందని సంతోషించేలోగానే మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం ప్రజాస్వామ్యవాదులకు చాలా బాధ కలిగించే విషయమే. కానీ ఇది హరీష్ రావత్ స్వయంకృతాపరాధమే కనుక ఈసారి భాజపాని తప్పు పట్టడానికి వీలులేదు.