తిరుపతిపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎం జగన్ ఉపఎన్నికల్లో ప్రచారం చేయరని నిన్నటి వరకూ వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే హఠాత్తుగా ఆయన ప్రచార షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. జగన్ ప్రచారానికి దిగాలని నిర్ణయించడం ఇతర పార్టీల నేతలకు ధైర్యం ఇచ్చినట్లయింది. వైసీపీ ఇప్పటికే నైతికంగా ఓడిపోయిందని విమర్శలు ప్రారంభించారు. జగన్ ఓటు అడగరని .. ప్రకటనలు చేసిన మంత్రులపై టీడీపీ నేతలు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ.. వైసీపీ ప్రభావం తగ్గిందని నిరూపించాలన్న పట్టుదలతో ఉంది. గత మెజార్టీ కంటే వైసీపీకి తగ్గిస్తే చాలనుకుంటోంది. క్లస్టర్ల వారీగా కార్యాలయాలు ప్రారంభించి ఇంచార్జ్ లను నియమించిన తెలుగుదేశం ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. లోకేష్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతున్నారు. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను టీడీపీ తిరుపతిలో మోహరింప చేసింది. ప్రతి ఓటర్ను కలవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జగన్ ప్రచారానికి వస్తూండటంతో… పరిస్థితి వారు చెబుతున్నంత తేలిగ్గా లేదని.. నమ్మకంతో టీడీపీ నేతలు మరింత చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.
తిరుపతి బీజేపీ అభ్యర్థి కోసం బీజేపీ ముఖ్యనేతలెవరూ రావడం లేదు. పార్టీ అధ్యక్షుడు నడ్డా మాత్రం ఒక రోజు రానున్నారు. ఆ రోజే పవన్ కల్యాణ్ కూడా ఆయనతో పాటు సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక పవన్ ప్రచార సభ ఉండదు. బహుశా పన్నెండో తేదీన నడ్డా, పవన్, కంబైన్డ్ సభ ఉంటుంది. బీజేపీఅగ్రనేతలొస్తేనే తానొస్తానని పవన్ చెప్పిన మీదటే నడ్డా వస్తున్నట్లుగా భావిస్తున్నారు. మొదట్లో కనిపించినంత ఊపు ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదు. ఎన్నికలు ఎదుర్కొన్న అనుభవం ఉన్న నేతలు బీజేపీలో తక్కువ ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే మోడీ వేవ్ గెలిపిస్తుందని ఆశ పడుతున్నారు.