కేసీఆర్ ఫెడరల్ టూర్స్ .. దేశవ్యాప్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళ సీఎంతో కీలకమైన చర్చలు జరిపిన ఆయన ఇప్పుడు తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. స్టాలిన్‌తో భేటీ ఉంటుందని.. ప్రకటించినప్పటికీ డీఎంకే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీనికి కారణం కేసీఆర్ వ్యూహాత్మకంగా.. కాంగ్రెస్ మిత్రపక్షాల్లో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారనే క్లారిటీ రావడమే.
డీఎంకేపై కాంగ్రెస్ అనుమానపడేలా కేసీఆర్ స్కెచ్ వేశారా..?
కేసీఆర్ తన దక్షిణాది యాత్రను పక్కాగా ఖరారు చేసుకున్నారు. ఓ వైపు ప్రసిద్ధ ఆలయాలు సందర్శిస్తూనే మరో వైపు ..రాజకీయ చర్చలు జరపబోతున్నారు. కేసీఆర్ పర్యటనపై సహజంగానే… దేశవ్యాప్త ఆసక్తి వ్యక్తమవుతోంది. కేరళ సీఎంతో ఆయన జరిపిన చర్చల ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై.. వివిధ పార్టీల్లో… అంచనాలు మొదలయ్యాయి. అయితే… కమ్యూనిస్టు పార్టీల్లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ విడిగా ఉంటుంది. కేరళ సీఎం అయినప్పటికీ.. విధానపరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం .. విజయన్‌కు లేదు. కనీసం అభిప్రాయం కూడా వ్యక్తం చేయలేరు. అందుకే..కేసీఆర్ తో భేటీ తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడారు . పదమూడో తేదీన చెన్నై చేరుకుని.. డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో సమావేశం అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ మేరకు.. టీఆర్ఎస్ వర్గాలు అధికారిక ప్రకటన కూడా ఇచ్చాయి. అయితే.. ఈ ప్రకటనను.. డీఎంకే వర్గాలతో చర్చించరో లేదో కానీ.. ఆలాంటి భేటీ ఏమీ ఉండదని… డీఎంకే అధికారికంగా ప్రకటన చేసింది. తమిళనాడులో.. ఈ నెల పందొమ్మిదో తేదీన జరగనున్న మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉంటారని.. అందుకే ఆయన ఎలాంటి భేటీలనూ.. పెట్టుకోలేదని డీఎంకే వర్గాలు ప్రకటించాయి. దీంతో స్టాలిన్ – కేసీఆర్ భేటీపై… ఉత్కంఠ ప్రారంభమయింది..
కాంగ్రెస్ అనుకూల పార్టీలపైనే గులాబీ దళపతి గురి ఎందుకు..?
నిజానికి.. కేసీఆర్ గతంలోనూ ఓ సారి తమిళనాడు వెళ్లి.. స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అయితే అప్పటికే…స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో కూటమిలో చేరిపోయారు. కాంగ్రెస్ తో.. డీఎంకే సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఇప్పుడు డీఎంకే భాగస్వామి. పైగా.. స్టాలిన్… కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీల నేతల కంటే ఎక్కువగా… రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. కూటమిలోని ఇతర పార్టీల నేతలు అభ్యంతరాలు చెప్పినా.. డీఎంకే అభిప్రాయం మాత్రం.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమేనని చెబుతున్నారు. ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తమిళనాడులో స్వీప్ చేస్తుందన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో.. కేసీఆర్ తో.. భేటీ అయ్యేందుకు స్టాలిన్ అంగీకరించారన్న ప్రచారం కాస్త కలకలం రేపింది. కాంగ్రెస్ కూటమిలో ఇది అపోహలకు దారి తీస్తుందేమోనన్న కారణంగానే స్టాలిన్ తన భేటీపై వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
చివరికి ఒక్క జగన్‌తో మాత్రమే కేసీఆర్ సర్దుకుపోవాలా..?
స్టాలిన్ తో భేటీ తర్వాత ఆయన బెంగళూరు వెళ్లి కుమారస్వామితో చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ఫోన్లో కుమారస్వామితో చర్చలు జరిపారని చెబుతున్నారు. కుమారస్వామి ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ సమయంలో.. కాంగ్రెసేతర కూటమిలోకి ఆహ్వానించేందుకు వస్తున్న కేసీఆర్ తో.. సమావేశం అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. కేసీఆర్ భేటీల జాబితాలో… ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో చర్చలకు కేసీఆర్ విజయవాడ వెళ్తారని … గతంలోనే కేటీఆర్ ప్రకటించారు. ఆ సందర్భం.. ఇప్పుడు రావొచ్చని చెబుతున్నారు. అంటే.. చివరికి మళ్లీ చివరికి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే.. కేసీఆర్‌కు జోడిగా ఉండే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు… కేసీఆర్ ట్రాప్‌లో పడేందుకు సిద్ధంగా లేవు.