దురదృష్టవంతుడ్ని బాగు చేయలేరు.. అదృష్టవంతుడ్ని చెరపలేరు అంటారు.. రాజకీయాలలోనూ అంతే. అయితే ఎక్కడైనా కావాల్సింది సహనమే. సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ పై కొట్లాడి… ప్రతిపక్షంలో ఉండి.. ఓడిపోయే ముందు ముళ్లీ అదే పార్టీలో చేరిన కొంత మంది పరిస్థితి దీనంగా మారిపోయింది. ఇలాంటి నేతలు ఇప్పుడు తమ రాజకీయ నిర్ణయాలపై తమను అద్దంలో చూసుకుని తిట్టుకుంటూ ఉండవచ్చు.
ఇలాంటి వారిలో దాసోజు శ్రవణ్ ముందు ఉంటారు. మంచి విషయం, వాగ్దాటి ఉన్న నేత దాసోజు శ్రవణ్. పీఆర్పీతో ప్రారంభించి.. పవన్ కల్యాణ్ కు మంచి మిత్రుడుగా ఉన్న ఆయన తర్వాత రాజకీయ పయనం.. బీఆర్ఎస్.. కాంగ్రెస్.. బీజేపీ, బీఆర్ఎస్ అంటూ సాగింది. కానీ ఎక్కడా ఆయనకు గుర్తింపు ఇవ్వలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ గవర్నర్ ఆమోదించలేదు. చివరికి బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఏ పదవి లేకుండా అయింది. కాంగ్రెస్ లో ఏఐసిసీ స్థాయిలోనే పదవి ఇచ్చారు. కానీ రేవంత్ ఏదో చేసేస్తున్నారని కంగారుపడి పార్టీలు మారిపోయారు.
కాంగ్రెస్ లో చాలా కాలం పని చేసి… తీరా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ముందే పార్టీ మారిపోయిన దురదృష్టవంతులూ ఉన్నారు. చెరుకు సుధాకర్ అనే ఉద్యమకారుడ్ని పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని కూడా ఎదిరించారు. కానీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని … పదేళ్లుగా తనను వేధించిన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయింది. జిట్టా బాలకృష్ణారెడ్డి ప రిస్థితి అదే. ఇక గాయకుడు ఏపూరి సోమన్నను రేవంత్ ఎంతో ఆదరించారు. ఆయన పరిస్థితి కూడా అదే.
ఎన్నికలకు ముందు హరీష్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. టిక్కెట్ రాని కాంగ్రెస్ నేతల్ని చాలా మందిని ఆకర్షించారు. వారంతా ఇప్పుడు దురదృష్టవంతులుగా మిగిలారు. కాంగ్రెస్ లో చేర్చుకున్నా.. ఏ పదవైనా ఇస్తారా అంటే కష్టమే మరి.