విజయనగరం జిల్లా నలుమూలలా రాజకీయంగా పాతుకుపోయిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బడ్డుకొండ అప్పల్నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బొత్స సత్యనారాయణ బంధువు. బొత్స సత్యనారాయణ తన గురువు పెన్మత్స సాంబశివరావరాజుకు… కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చెక్ పెట్టారు. ఆయనను కాదని.. 2009లో తన బంధువు బడ్డుకొండ అప్పల్నాయుడుకి టిక్కెట్ ఇప్పించారు. అప్పుడు ఆయన గెలిచారు. తర్వాత ఓడిపోయినా.. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ వైసీపీ తరపున టిక్కెట్ ఇప్పించి గెలిపించారు.
కానీ ఇప్పుడు ఆయనకు బొత్సతో సరిపడటం లేదు. దీనికి కారణం మరో సోదరుడు బొత్స లక్ష్మణరావు నెల్లిమర్ల నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారు. దీంతో తనను కాదని లక్ష్మణరావును బొత్స ప్రోత్సహిస్తున్నాడని అప్పల్నాయుడుకి కోపం వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అప్పల్నాయుడు వర్గాన్ని కాకుండా లక్ష్మణరావు తన వర్గానికి వైసీపీ అభ్యర్థులుగా మద్దతు ఇస్తున్నారు. దీంతో అప్పల్నాయుడుకు కోపం వచ్చింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. లక్ష్మణరావు, అప్పల్నాయుడు ఇద్దరూ బంధువులే. బొత్స నీడలోనే రాజకీయంగా అవకాశాలు దక్కించుకుంటున్నారు.
అయితే అప్పల్నాయుడుకి ముందుగానే చాన్స్ వచ్చింది. లక్ష్మణరావు ఇప్పుడు చాన్స్ కోసం చూస్తున్నారు. ఆయన చూపు నెల్లిమర్లపై పడింది. ఆయనకు … బొత్స సపోర్ట్ ఉందని అప్పల్నాయుడు మాటలతోనే తెలిసిపోతోంది. కుటుంబంలో రేగిన చిచ్చును సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం కూడా బొత్స చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ పెత్తనంపై విజయనగరం జిల్లాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా విబేధాలు బయటకు వచ్చాయి. అయితే అప్పల్నాయుడుకి కొంత పార్టీ పార్టీ హైకమాండ్‌లోని పెద్దలు సపోర్ట్‌గా ఉన్నారన్న ప్రచారమూ ఉంది.