కేశినేని కుటుంబంలో రాజకీయ చిచ్చు ప్రారంభమైంది. తన పేరు,హోదాను ఉపయోగించుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వ్యవహరాలు సాగిస్తున్నారని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సోదరుడు చిన్నీ పేరు చెప్పకుండా విజయవాడ పార్ల మెంటు సభ్యుడిగా తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది సృష్టించి, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతు,తన పేరు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.వాహనం నెంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777గా పేర్కొంటూ విజయవాడ పటమట పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు.
మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఇదే వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. ఆ వాహనం కేశినేని నాని సోదరుడు చిన్నీది తేలడంతో వివాదం ప్రారంభమయింది.విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుంచి రెండు సార్లు గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో కూడ సోదరుడు కేశినేని చిన్ని కీలకపాత్ర పోషించారు. ఇటీవల చిన్ని కూడా టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న సమాచారం రావడంతో కేశినేని నాని సోదరుడిపై ఆగ్రహం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె, ప్రస్తుత టీడీపీ కార్పోరేటర్ శ్వేతను తూర్పు నియోజకవర్గం నుండి బరిలో కి దింపాలని కేశినేని నాని భావిస్తున్నారు. అయితే చిన్నీ కూడా రేసులోకిరావడంతో ఇప్పుడు సంబంధాలు తెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తనపై నాని కేసు పెట్టడంతో చిన్నీ ప్రెస్మీట్ పెట్టారు. కేశినేని నాని మాకు శత్రువు కాదు.. మా సొంత అన్న అని, తాను కేవలం పార్టీలో సాధారణ కార్యకర్తనని చెప్పారు. పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎవరినీ టిక్కెట్ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే, సోదరుడు కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.
కుటుంబ పరంగా పరిష్కరించుకోవాల్సిన వివాదాన్ని పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లడంతో కేశినేని కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.