అయిపోయింది. మొత్తానికి హోదా పుణ్యమాని వచ్చిన చిక్కులనుంచీ విజయవంతంగా ఎస్కేప్ అయ్యారు చంద్రబాబు అండ్ ఆయన అనుకూల మీడియా. వాళ్ళవరకూ చూసుకుంటే మాత్రం ప్రత్యేక హోదా అనే మాట కూడా ఇకపై వినిపించకూడదు అన్న పట్టుదల కనిపిస్తోంది. అందుకే అందరూ కూడా ఒకేపాటను తిప్పి తిప్పి పాడుతున్నారు. హోదా అన్నది జరిగిపోయిన చరిత్ర, అయిపోయిన విషయం, హోదా సంగతి మర్చిపోయి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి…ఇలా అందరూ ఒకేపాట పాడుతున్నారు. అదే సందర్భంలో ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తున్నవాళ్ళకు, ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపిలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నాయి అని నిందిస్తున్నవాళ్ళకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు టిడిపి, బిజెపి పార్టీ జనాలు. అసలు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన వచ్చిందే మేం డిమాండ్ చేయబట్టి అని ఎదురుదాడికి దిగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి ఆలోచించింది. వెంకయ్యనాయుడు మాత్రం ప్రత్యేక హోదా క్రెడిట్ మొత్తం కొట్టేశాడు. రాష్ట్ర విభజన పాపంలో బిజెపికి కూడా సమాన భాగం ఉంది అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తుకు రాకుండా ఉండడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డేశారు. వెంకయ్యనాయుడిని హీరోని చేశారు. పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి బిజెపివాళ్ళు ఓట్లు దండుకున్నారు. పదిహేనేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇచ్చేలా చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనసు గెలిచాడు. విభజన పూర్తయ్యేవరకూ సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సడన్ ఎంట్రీ ఇచ్చి హోదా రావాలంటే టిడిపి, బిజెపిలను గెలిపించండి అని చెప్పాడు. వాళ్ళిచ్చిన హామీలకు తనది పూచీ అన్న స్థాయిలో మాటలు చెప్పేశాడు.
ఇక కుర్చీ ఎక్కిన దగ్గర నుంచీ టిడిపి, బిజెపి, పవన్‌లు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. మొదటి ఏడాది అంతా ప్రత్యేక హోదా అదిగో వచ్చేస్తుంది…ఇదుగో వచ్చేస్తుంది అన్నారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికలు అయిపోగానే వచ్చేస్తుంది అన్నారు. ప్రత్యేక హోదా కోరుతు అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేయించాడు చంద్రబాబు. టిడిపి ఎంపీలు పార్లమెంట్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక రెండో ఏడాది తర్వాత నుంచీ మాత్రం… ఓ వైపు ప్రత్యేక హోదా కోసం అని చెప్పి హంగామా చేస్తూనే …మరోవైపు ప్రత్యేక హోదా మరీ గొప్పదేమీ కాదు అని సన్నాయి నొక్కులు నొక్కడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న వాయిస్‌ని పూర్తిగా తొక్కేశారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. రాజ్యాంగం ఒప్పుకోవడం లేదు. రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. బోలెడు మంది ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ డ్రామాని రసవత్తరంగా నడిపించడంలో భాగమయ్యాడు. ప్రత్యేక హోదా రాదు అని చెప్పి చాలా మందికి చాలా స్పష్టంగా అర్థమయిన తర్వాత కూడా ‘ఇవ్వము అని స్పష్టంగా చెప్పలేదు కదా…ఇవ్వము అని చెప్తే అప్పుడు మాట్లాడతా…’ అని సన్నాయి నొక్కులు నొక్కాడు పవన్. కానీ అప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పి పార్లమెంట్‌లోనే చెప్పింది బిజెపి ప్రభుత్వం. ఇక ఫైనల్‌గా అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదు అని చెప్పి ప్రజలను నిరుత్సాపరచడంంలో సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేసిన గొంతులన్నింటినీ సక్సెస్‌ఫుల్‌గా తొక్కేశారు.
ఆ తర్వాత ప్యాకేజీ డ్రామాకు తెరలేపారు. ఇప్పుడిక ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ లేని హంగామాను సృష్టించారు. మోడీకి, బిజెపికి అస్సలు చెడ్డపేరు రాకుండా వీర భక్తుడి పాత్రని పోషిస్తున్నాడు చంద్రబాబు. ప్రత్యేక హోదాని మర్చిపొమ్మని జనాలకు చెప్తున్నాడు. చంద్రబాబు…ఆయన అనుకూల మీడియా దెబ్బకు జనాలు ప్రత్యేక హోదాని మర్చిపోవచ్చు. ప్రత్యేక హోదా అంటేనే జనాలకు విరక్తి వచ్చేలా కూడా చేయగల ఘనులు చంద్రబాబు అండ్ ఆయన భజన మీడియా జనాలు. కాకపోతే ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు, వెంకయ్యనాయుడు, బిజెపి, టిడిపి, పవన్, బాబు అనుకూల మీడియాలు చేసిన మోసాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోగలరా?