రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో అట్టుడికి పోతోంది. అనకూల, వ్యతిరేక ప్రచారంతో అటు అధికారపక్షం.. ఇటు ప్రతిపక్షం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాను అదే వాడుకుంటున్నారు. కానీ ఐదు జిల్లాలప్రజలకు ఇదేమీ పట్టడం లేదు. ఎందుకంటే వారి కన్నీటి చుక్కలు తమ సర్వస్వాన్నిలాక్కెళ్లిపోయిన వరదల్లో బొట్లుగా మారిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. కరెంట్ లేదు. తిండి లేదు. చెప్పుకుందామంటే ఒక్క ప్రభుత్వ అధికారీ రావడం లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితి వరద బాధిత ప్రాంతాల్లో ఉంది. వరదలు ఆగిపోయినప్పటికీ అది సృష్టించిన విలయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కొన్నివేల మంది ప్రజలు వరద ముంపు భయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వారంతా రోడ్ల మీద కాలం గడుపుతున్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన బీభత్సానికి సగం మంది ప్రజలకు మంచి నీళ్లు కూడా కరవయ్యాయి. రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా పూర్తి స్తాయి కరెంట్ సరఫరా చేయలేదు. రాజంపేట నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత దుర్భంగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం లేని వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సొంత ఖర్చుతో ఇంటి దగ్గర అన్నదానం చేయిస్తున్నారు. ఇక రోడ్లు, కరెంట్ సమస్యలను తీర్చడానికి ఎంత కాలం పడుతుందో అర్థం కాని పరిస్థితి.
నెల్లూరులోనూ అంతే ఉంది. నెల్లూరు నగరం సగం నీట మునిగింది. వందల మంది పేదలు తిండి, నీళ్లు కూడా తిప్పలు పడుతున్నారు.తిరుపతిలో రాయల చెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోతుందని అధికారులు చుట్టుపక్క గ్రామాల్లో చాటింపు వేశారు. అంటే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాలని చెబుతున్నారు. కానీ ఎలాంటి సహాయ పునరావాస కార్యక్రమాలూ పెద్దగా చేపట్టలేదు. ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి.. సమీక్ష చేసి ఉంటే అధికారులు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. కానీ సీఎం జగన్ హెలికాప్టర్లో వరద ప్రాంతాలను చూసి నేరుగా తాడేపల్లికి వెళ్లిపోయారు.
మరో వైపు వరదల కన్నా ఎక్కువగా మంత్రులు రాజకీయాల మీదనే దృష్టి పెట్టారు. చంద్రబాబును తిట్టడం.. టీడీపీ నేతల్ని విమర్శించడం.. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే సరి పెడుతున్నారు. ఈ రాజకీయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునే దిక్కు కూడా కనిపించడం లేదు.