ఆపదలో ఆదుకున్న వాడిని మంచోడంటాం..! అదే ప్రాణాలు నిలిపితే దేవుడంటాం…! కరోనా విపత్తుల్లో అందరి ప్రాణాలను కాపాడే ఔషధాలను కనిపెట్టి.. తయారు చేసి ఇచ్చే వాళ్లను ఏమనాలి..? దైవం మానుష్య రూపేణా.. అని అనుకోవాలి. సాధారణ జనం అనుకుంటారు కూడా. కానీ రాజకీయ నాయకులు మాత్రం అనుకోరు. రాజకీయ నాయకులకు వారు రాక్షసులు.. అంతకు మించి. వారి కులం.. మతం.. ప్రాంతం.. అన్నీ గుర్తుకు తెచ్చుకుని వారిని ఎన్ని విధాలుగా మానసిక హింస పెట్టాలో పెట్టి దేశం నుంచి తరిమేసేవరకూ ఊరుకోరు. తమ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టని రాజకీయ నేతలు… వ్యాక్సిన్లను తయారు చేసి ప్రజల్ని కాపాడుతున్న వారిపై మాత్రం తమ వికారాన్నంతా చూపిస్తున్నారు.
వ్యాక్సిన్ రూపకర్తలపై రాజకీయ విషం..!
దేశంలో ప్రస్తుతం రెండే టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్. ఈ టీకా.. తయారీ మాత్రమే ఇండియా. ఫార్ములా విదేశాలది. ఆక్స్ఫర్డ్ తయారు చేసింది. సీరం ఇనిస్టిట్యూట్ ఇండియాలో ఉత్పత్తి చేస్తోంది. ఇంకోటి… సంపూర్ణంగా దేశీయ టీకా. అదే కోవాగ్జిన్. భారత్ బయోటెక్ రూపొందించింది. ఈ రెండూ టీకాలు ప్రజల ప్రాణాల్ని కాపాడుతున్నాయని తేలింది. టీకాలు తీసుకున్న వారిలో 0.002 శాతం కూడా.. కరోనా బారిన పడటం లేదు. ఎవరైనా కరోనా బారిన పడినా.. ప్రాణాంతకం కావడం లేదు. అలాంటి వ్యాక్సిన్ సిద్ధం చేసి.. ప్రజలకు అందిస్తున్న ఆ రెండు కంపెనీయల యజమానులు ఇప్పుడు.. బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఒకరు ఇండియా నుంచి వెళ్లిపోతే.. మరొకరు కులం పేరుతో నిందలు మోయాల్సి వస్తోంది. కన్నీటితో వారు తమ నిబద్ధత గురించి సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సి వస్తోంది.
రాజకీయ బెదిరింపులకు లండన్ పారిపోయిన సీరం యజమాని..!
కోవిషీల్డ్ ఉత్పత్తి దారు అయిన సీరం ఇనిస్టిట్యూట్ యజమాని అదర్ పూనావాలా తనను ముఖ్యమంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ లండన్ వెళ్లిపోయారు. తమ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని … పంపిణీ చేస్తున్నామని అయినా కొందరు ముఖ్యమంత్రులు బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.తాను ఇప్పుడల్లా లండన్ నుంచి రానని ప్రకటించడమే కాదు… అక్కడే పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల్ని కాపాడుతున్న సీరం అధిపతికి.. మన రాజకీయ నాయకులు చేసిన సన్మానం బెదిరింపులు.
భారత్ బయోటెక్ యజమానులపై కుల ముద్ర వేసి వేధింపులు..!
అలాగే భారత్ బయోటెక్ అధినేతలు ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారిపై కుల ముద్రవేసేశారు.. ఘనత వహించిన ఓ ముఖ్యమంత్రి. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం.. కోటిన్నర డోసులు. మొత్తం ఉత్పత్తి చేసి.. ఎవరి కోటా మేరకు వారికి పంపుతున్నారు. కానీ.. చంద్రబాబు బంధువు అని.. అందుకే వారు వ్యాక్సిన్ ఇవ్వడం లేదని.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నిందలేశారు. దీనికి భారత్ బయోటెక్ యజమానుల్లో ఒకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఆమె ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు. అది ఆమె నైతికత. కానీ అసుల ఏమీ లేకపోయినా.. వ్యాక్సిన్‌పై.. వ్యాక్సిన్ కంపెనీపై కులముద్ర వేసి వేధించడం ప్రారంభించిన ముఖ్యమంత్రి… మన రాజకీయం పెంచి పోషించిన వ్యక్తి.
కేంద్రం కూడా అంతే.. బాధ్యత కూడా లేనట్లే..!
ఇలాంటి ధోరణులను కేంద్రం ఎప్పటికప్పుడు… తుంచేయాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తూ.. కేంద్ర పెద్దలు కూడా .. అదే మైండ్‌సెట్‌తో ఉన్నారు. అందుకే.. వారిని గౌరవించాలన్న అభిప్రాయం.. సూచనలు.. వారి వైపు నుంచి రాలేదు. ఫలితంగా రాజకీయనేతలు పేట్రేగిపోతున్నారు. ఇలాగే ఉంటే.. దేశం కొన్నాళ్లకు… మార్చుకోలేనంతగా భ్రష్టుపట్టిపోతుంది.