”సినిమా ఇండస్ట్రీలో లం**** లేరా?” అంటాడు లైవ్ డిబేట్ లో ఓ జర్నలిస్టు.
ముఖ్యమంత్రి అయ్యాక తనతో ములాఖాత్ జరపలేదని, ఆ ఈగోతో టికెట్ రేట్లని అడ్డుపెట్టుకొని ఓ ఆట ఆడుకొన్నాడో శాడిస్టు సీఎం.
తమ పార్టీని వ్యతిరేకించే హీరో సినిమా వస్తే – ప్రభుత్వ ఉద్యోగులతో టికెట్లు అమ్మించాడో మంత్రి.
సినిమా వసూళ్లెంతో చెప్పడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి విలువైన ప్రజా ధనాన్నీ, ప్రజా సమయాన్నీ వృధా చేశాడు మరో మంత్రి.
ఇప్పుడు తన ప్రత్యర్థిని కార్నర్ చేయబోయి.. సినిమాల్నే నమ్ముకొని బతుకుతున్న ఓ కుటుంబ గౌరవాన్ని మంటకలపాలని చూసిందో మహిళా మినిస్టర్!
సినిమావాళ్ల జీవితాలు అద్దాల మేడలు. పైకి అందంగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడు భళ్లుమంటాయో ఎవరికీ తెలీదు. ఒక్క రాయే కదా విసిరేద్దాం అనుకొంటారంతే. ఆ చిన్న గుళకరాయె అందమైన ఆ కుటీరాన్ని చిన్నాభిన్నం చేస్తుంటుంది.
రాజకీయం ఓ దుర్మార్గమైన క్రీడ. బలమైన ఇష్యూ ఏదో నడుస్తున్నప్పుడు ఆ సమస్యని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఏదో ఒకటి కావాలి. ఆ ఒకటి… ‘సినిమా’ అవ్వడం సినిమావాళ్ల దురదృష్టం. సడన్గా సినిమా వాళ్లపై ఐటీ దాడులు జరుగుతాయి. సడన్ గా డ్రగ్స్ కేసు తవ్వి తీస్తారు. సడన్గా… ఇలా అక్రమ సంబంధాల గుట్టు రట్టవుతుంది. ఇదంతా ఎందుకు? అప్పటి వరకూ భగ్గుమంటున్న ఓ ప్రధానమైన సమస్య సైడ్ ట్రాక్ పట్టడానికి. ప్రతీసారీ… టార్గెట్ సినిమా వాళ్లే. సినిమా వాళ్ల గురించి చెబితేనే కదా, జనం కాస్త ఆసక్తి చూపిస్తారు. నిజమేనేమో అని నమ్మేస్తారు. నాలుగైదు రోజులు దాని గురించి మాట్లాడుకొంటే చాలు. పాత విషయాలు మర్చిపోతారు. ఈ నాలుగు రోజుల్లో ఆ కుటుంబాలు ఎంత నలిగిపోయినా, ఇంకెంత నరకయాతన పడినా ఓకే!
సినిమావాళ్లని రాజకీయ నాయకులు వాడుకొన్నంత ఎవరూ వాడుకోరు. వాళ్ల ప్రచారానికి కావాలి. పార్టీ ప్రమోషన్లకు కావాలి. ఏదైనా ఈవెంట్లు జరుగుతున్నప్పుడు పిలవగానే రావాలి. రాష్ట్రానికి ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ధారాళంగా విరాళాలు ఇవ్వాలి. గవర్నమెంట్లు యాడ్లలో నటించేయాలి.. ఇలా చాలా చేయాలి. దాంతో పాటు… ఓ మాట అన్నా పడాలి. లంజతనం, రంకుతనం అంటగట్టిగా అంటించుకోవాలి. ఇది సినిమా వాళ్ల జాతకం. ఇవన్నీ చేసినా కూడా.. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై బతకాలి. కొత్త సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచమని అడుక్కొంటూ ఉండాలి. వాళ్ల కాళ్లకు పొర్లి పొర్లి దండాలు పెడుతుండాలి… ఏం జాతకమో ఇది!
తెలంగాణలో హైడ్రా ప్రధానమైన టాపిక్ అయిపోయింది. దాని గురించే విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ చర్చ కు కొన్ని రోజులు సమంత వ్యవహారం పక్కదోవ పట్టిస్తుంది. జనాలు ఎప్పటిలా పాతవన్నీ మర్చిపోయి.. దీని గురించే మాట్లాడుకొంటారు. అది చాలు. ఆపరేషన్ సక్సెస్. ఈ క్రమంలో ఎంతమంది పేషెంట్లు పోయినా డోన్ట్ కేర్! ఈసారి పావు సమంత, అక్కినేని కుటుంబం. అంతే.
కాస్తలో కాస్త ఆనందించాల్సిందేమిటంటే.. సమంతపై చేసిన ఈ దారణమైన వ్యాఖ్యల్ని చిత్రసీమ తిప్పి కొట్టింది. సమంతతోపాటు అక్కినేని కుటుంబానికి అండగా నిలిచింది. `ఇలా మాట్లాడితే ఏమవుతుంది, ఆ పర్యావసానాలేంటి` అని రాజకీయంగా లెక్కలేసుకోకుండా.. ధైర్యంగా స్పందించింది. ఈ ఐకమత్యం వర్థిల్లాలి. సమంత ఇష్యూలోనే కాదు. ఇకపై సొంత లాభం కోసం చిత్రసీమని ఎవరు టార్గెట్ చేసినా ఇంతే ధీటుగా స్పందించాలి. ఎవరి గురించైనా ఇలా టైమ్ పాస్ గాసిప్ స్టేట్మెంట్లు పాస్ చేయాలనుకొనేవాళ్ల వెన్నులో ఒణుకు పుట్టేలా.. గర్జించాలి. ‘మా జోలికి వస్తే ఊరుకోం’ అంటూ ఓ బలమైన సంకేతం పంపాలి. అందుకోసం ఏం చేయాలో చిత్రసీమ ఇప్పుడే ఆలోచించాలి.