రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడం, ఎన్నికల వరాలు ప్రకటించడం దగ్గర్నుంచే. ఆల్ ఫ్రీ….అన్నీ ఉచితంగా ఇస్తాం అని చెప్తారు. ఎవడబ్బ సొమ్మురా? అని రామదాసులా ప్రశ్నించే ధైర్యం ఓటర్లకు లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే పోలీస్ పవర్‌ని రుచి చూపించగల సమర్థులు మన నాయకులు. నాయకుల మోసాల నుంచి ప్రజలను కాపాడే బాధ్యతల విషయంలో మన పోలీసులంత వెన్నెముక లేని మనుషలు ఎవ్వరూ ఉండరు. కానీ మోసం చేసిన నాయకుడిని కేవలం ప్రశ్నించడానికి మాత్రమే వచ్చిన పౌరుడి పైన మావోయిస్ట్, టెర్రరిస్ట్ ముద్ర వేయగల సమర్థులు మన పోలీసులు. ఓటర్లను, ప్రభుత్వ అధికారులను అజమాయిషీ చేసినట్టుగానే పోలీసులను కూడా కంట్రోల్లో ఉంచుతుంటారు మన నాయకులు. ఎవరికి కావాల్సిన బిచ్చం వాళ్ళకు వేస్తూ ఉంటారు.
ఇప్పుడు మరోసారి దేశంలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటన ప్రారంభమైంది. కొన్నేళ్ళ క్రితం వరకూ పావలా, అర్థ రూపాయికే బిచ్చగాళ్ళు శాటిస్ఫై అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రూపాయిని కూడా చాలా చీప్‌గా చూస్తున్నారు. ఓటర్లను కూడా నాయకులు ఇలాగే చూస్తున్నట్టున్నారు. అందుకే గతంలో రెండు రూపాయిలకే కిలో బియ్యం, తక్కువ ధరకే వంట సామానులు లాంటి హామీల స్థానంలో టివిలు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ వచ్చి చేరాయి. సో….కొత్తగా ఓటు హక్కు తెచ్చుకున్న, అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న యువతను కూడా బిచ్చగాళ్ళను చేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టారన్నమాట. అన్నట్టు పంజాబ్‌లో అయితే డ్రగ్స్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారట. వారెవ్వా…….కొంతమంది నిరంకుశ రాజుల విషయం పక్కన పెడితే చాలా మంది రాజులు కూడా ప్రజలను ఇలా ట్రీట్ చెయ్యలేదేమో. మన పేరు గొప్ప ప్రజాస్వామ్య, ప్రజలెన్నుకున్న, ఎన్నుకుంటున్న నాయకులు మాత్రం దిగ్విజయంగా ప్రజలను బిచ్చగాళ్ళను చేసేస్తున్నారు. మార్పు రావాలి, మార్పు తెస్తాం అని కొత్తగా పాలిటిక్స్‌లోకి వస్తున్నవాళ్ళైనా ఈ ‘బిచ్చం’ ట్రెండ్‌ని మారుస్తారేమో చూడాలి. అలాగే మేం పన్నులు కడితే వచ్చిన మా సొమ్మును…..నీ సొంత సొమ్ములాగా…మాకు ఫ్రీగా ఇస్తానంటావేంట్రా…మాకేమన్నా బిచ్చమేస్తున్నావా? అని ప్రశ్నిస్తారేమో చూడాలి.
ప్రజలకు ఉచితంగా ఇస్తాం, ఇస్తున్నాం అని వాళ్ళకు బిచ్చం వేస్తున్నట్టుగా నాయకులు గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించడం కాదా? మన దగ్గర చాలా చాలా చిన్న విషయాలకే కొంతమంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. మరి ప్రజలను బిచ్చగాళ్ళుగా ట్రీట్ చేస్తున్న నాయకుల చర్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా? అలాంటి వాళ్ళు ఎవరైనా కోర్టు తలుపులు తడతారేమో చూడాలి. దేశానికి పట్టిన ఈ ‘ఓటర్లను బిచ్చగాళ్ళను చేయడం’ అనే దరిద్రం వదలించదంటే నోటు రద్దులాంటి ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాలతో జరిగే మేలు కంటే చాలా ఎక్కువ మేలే జరుగుతుందనడంలో సందేహం లేదు.