సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏదో ఒకటి చేయకపోతే ఎలా అనుకున్నారేమో కానీ ఇప్పుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ధూళిపాళ్ల నరేంద్రకు వాటిని అందించారు. ఈ నోటీసులను దేవాదాయ శాఖ నుంచి జారీ చేశారు.
సంగం డెయిరీ ప్రాంగణంలోనే డీవీసీ ట్రస్ట్ ఉంది. రెండు నెలల కిందటే ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టీల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని నోటీసులు ఇచ్చారు. ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడు వారంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ధూళిపాళ్ల మళ్లీ కోర్టుకెళ్లి తమను ప్రభుత్వం నుంచి రక్షించాలని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సమయంలో ప్రధానంగా ఈ ట్రస్ట్‌పైనే ప్రభుత్వం, వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. 1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి. రైతులకు, సంగం డెయిరీ ఉద్యోగులకు సేవలు అందించేందుకు నిర్మించారు. అయితే ఆస్పత్రి కట్టి పది ఎకరాలు సంగం డెయిరీవని అలా ట్రస్ట్‌కు తీసుకోవడం చట్ట విరుద్ధమన్న కారణాన్ని సంగం డెయిరీ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ట్రస్ట్ నే స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.