చోడవరం మినీ మహానాడులో అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్, రోజా అందరిపై తీవ్ర విమర్శలు చేశారు. అవి విమర్శల స్థాయి దాటి బూతులు దాకా వెళ్లాయి. ఈ అంశంపై టీడీపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపించాయి. వైసీపీ స్థాయికి దిగజారాలా అని కొందరు.. ఎంత కాలం అని వైసీపీ వాళ్లు తిడితే తిట్టించుకుందామని మరికొంత మంది విడిపోయారు. అయితే ఈ బూతులు వైసీపీ నాయకత్వాన్ని సూటిగా తాకాయి. తిరిగి తిడితే మళ్లీ తిడతారు.. అందుకే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అయ్యన్న ఇంటి గోడను టార్గెట్ చేసుకున్నారు.
రాత్రికి రాత్రి కనీసం రెండు, మూడు వందల పోలీసులతో బుల్డోజర్ను తీసుకు వచ్చి అయ్యన్న ఇంటి వెనుక ఉన్న గోడను పంట కాలువ ఆక్రమించి కట్టారని చెబుతూ కూల్చేశారు. రెండో తేదీన నోటీసు ఇచ్చామని ఓ నోటీసును మీడియాకు అప్పుడు ఇచ్చారు. నిజానికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అప్పటికప్పుడు పాత తేదీ వేసుకుని వచ్చి ఇచ్చి కూల్చేశారు. అంతకు ముందే గతంలో నర్సరాపుపేటలో అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఓ కానిస్టేబుల్ గుంటూరు నుంచి ప్రత్యేకంగా నర్సీపట్నం వచ్చారు. ఆయన వచ్చి వెళ్లగానే ఇటు లోకల్ పోలీసులు.. బుల్డోజర్తో వచ్చారు.
అయితే నర్సీపట్నం సభలో చేసిన వ్యాఖ్యలపై కొత్తగా కేసులు ఏమైనా పెట్టారో లేదో స్పష్టత లేదు కానీ.. పాత కేసుల్లో చాలా వరకూ అయ్యన్నపాత్రుడు స్టే తెచ్చుకున్నారు. కొన్ని కేసుల్లో నోటీసు ఇచ్చి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. అందుకే పలుమార్లు ప్రయత్నించినా అరెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ఎలా అని గోడ కూల్చేసినట్లుగా టీడీపీ వర్గాలు మండి పడుతున్నాయి. గతంలో సబ్బం హరి లాంటి నేతల ఇల్ల గోడలను కూడా తొలగించారు.