అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తొమ్మిదో తేదీలోపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ రోజు జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు… వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలందరూ హాజరవుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు.. అమరావతికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. అందుకే..టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ.. దాదాపుగా అందరూ హాజరవుతున్నారు. ప్రభుత్వానికి తమ వాయిస్ వినిపించనున్నారు.
అయితే.. వైసీపీ దీనికి పోటీగా.. మరో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. అమరావతిలో అసలు కోణం.. కుంభకోణం అంటూ.. వైసీపీ నేతలు నేరుగా తుళ్లూరులోనే ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు హాజరవబోతున్నారు. అమరావతిలో చంద్రబాబు ఏమీ కట్టలేదని.. అక్కడన్నీ కుంభకోణాలు జరిగాయని…వైసీపీ నేతలు.. ఆ సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించే వాటిపై.. నిజాలను బయట పెడతామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ ప్రశ్నిస్తున్న ప్రతి వైఫల్యంపైనా… వైసీపీ ఎదురుదాడి చేస్తూనే ఉంది. గతంలో.. టీడీపీ గుంటూరులో వైసీపీ పల్నాడు బాధితుల సమావేశం పెట్టింది. దానికి పోటీగా.. గురజాలలో టీడీపీ బాధితుల సమావేశం పెట్టారు వైసీపీ నేతలు. దానికి హోంమంత్రి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ప్రతీ విషయంలోనూ.. వైసీపీ ఇలాగే చేస్తోంది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ పోటీ సమావేశం పెడుతోంది. ఇలా చేయడం వల్ల సమస్యను మసిపూసి మారేడు కాయ చేసినట్లవుతుందని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.