రాజధాని ఖర్చు లక్ష కోట్లు.. అంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే వాదనను… బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మొదట లక్ష కోట్ల లెక్కను.. ప్రజల్లోకి పంపి.. ఆ తర్వాత అదంతా అప్పు అని.. ప్రజలపై భారం పడుతుందనే వాదనను తెరపైకి తీసుకు వచ్చింది. లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని.. అది సంక్షేమ పథకాలకు పంచినట్లుగా పోతుందని.. మళ్లీ తిరిగి రాదన్న అభిప్రాయాన్ని.. ప్రజల్లోకి పంపుతున్నారు. తమ సొమ్ము అంతా.. అమరావతిలో పెడుతున్నారనే అభిప్రాయాన్ని ఇతర ప్రాంతాల్లో కల్పించాడనికి మంత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఇందులో అద్భుతాన్ని చూస్తున్నారు. పట్టణీకరణకు.. ప్రపంచానికి ఓ దిక్సూచీ అవుతుందంటున్నారు. అందుకే జగన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి రియల్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. !
అమరావతి విషయంలో గత ప్రభుత్వం పక్కా ప్రణాళికలు వేసుకుంది. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై.. ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంది. ఈ మేరకు అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 50ను విడుదల చేసింది.ఈ ప్లాన్ ప్రకారం… అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది కేవలం 6629 కోట్లు మాత్రమే. రాజధానిని ప్రభుత్వం మొదటి నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా చెబుతూ వస్తోంది. భూములకు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత.. వాటి విలువ పెరుగుతోంది. అప్పుడు .. ప్రభుత్వానికి మిగిలే భూమితో సంపాదించుకునే ప్రణాళికలను ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
పట్టణీకరణకు ఓ సరికొత్త సక్సెస్ మోడల్ అవుతుందనుకున్న ప్రపంచం..!
అమరావతిలో ఆర్థిక నిపుణలు ఓ గొప్ప ఆర్థిక నమూనాను చూశారు. పట్టణీకరణకు ఓ అద్భుతమైన దిక్సూచీగా మారబోతోందని అంచనా వేశారు. 33వేల ఎకరాలు సమీకరించిన విధానం.. ఆ ప్రాజెక్ట్ పై.. దేశవ్యాప్తంగా విశ్వాసం పెరగడానికి కారణం అయింది. ఆ ప్రాజెక్ట్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే.. రెండు వేల కోట్ల రుణం కోసం..సీఆర్డీఏ బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయితే.. ఆ మొత్తం నిమిషాల్లోనే వచ్చింది. సాధారణంగా.. ప్రభుత్వాలకు చెందిన వాటిలో పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపరు. గతంలో పలు నగరాలు.. అలాంటి ప్రయత్నాలు చేసినా.. సక్సెస్ కాలేదు. అమరావతి మోడల్ సక్సెస్ అయితే.. పట్టణీకరణలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే.. వరల్డ్ క్లాస్ సిటీ.. సెల్ఫ్ ఫైనాన్షింగ్ ద్వారా పూర్తి కావడం అంటే.. ఓ గొప్ప సక్సెస్ మోడల్ దొరికినట్లే. అందుకే..జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అమరావతికి ప్రాధాన్యం తగ్గించడాన్ని జాతీయ మీడియా .. మొదటి నుంచి విమర్శిస్తోంది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు.. బిజినెస్ మీడియాకూడా.. తప్పు పట్టింది. మొదటి బడ్జెట్లో అమరావతికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం.. ఆ తర్వాత సింగపూర్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి ఆంశాలపై.. బిజినెస్ నిపుణులు తీవ్రంగా స్పందించారు. మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు.. శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిపై జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.
అమరావతిపై పెట్టే ప్రతి రూపాయి జీడీపీని పెంచే పెట్టుబడే..!
ప్రభుత్వాలు రెండు రకాలుగా ఖర్చు పెడతాయి. జీతాలు,సంక్షేమ పథకాలకు ఖర్చు ఓ రకం.. అభివృద్ధి పనులకు మరో రకం ఖర్చు. జీతాలు, సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వానికి ఖర్చు మాత్రమే. కానీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఖర్చు చేసే మొత్తం.. సంపద పెరగడానికి కారణం అవుతుంది. ప్రభుత్వం ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టి.. ఓ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మిస్తే.. దాని కింద ఓ పదివేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఆ పదివేల ఎకరాలు సాగు చేసేవారు.. పంట పండిస్తారు. అదే రాష్ట్ర సంపద. దాన్నే జీడీపీగా లెక్క వేస్తారు. అమరావతి విషయంలో కూడా అంతే. పెట్టే పెట్టుబడికి.. కొన్ని వందల రెట్ల ఆదాయం అమరావతి నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జీడీపీ పెరుగుతుంది.