కడపలో బుగ్గవంక నిర్వాసితుల ఇళ్లను జేసీబీలో దౌర్జన్యంగా కూలగొట్టడం ప్రారంభించిన వ్యవహారంలో ఇంజనీర్ రఘునాథరెడ్డిని నిర్వాసితులు తరిమికొట్టిన వీడియో ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో జేసీబీ రూల్‌ని అక్కడి ప్రజలు ఇలా తిరగబడతారని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెడుతోంది. వ్యతిరేక స్వరం వినిపిస్తేనే అంగీకరించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంజినీర్ని అదీ కూడా అధికార పార్టకి బాగా దగ్గర వ్యక్తిగా పేరున్న ఇంజినీర్ రఘునాథరెడ్డిని తరిమికొట్టడం అంటే చిన్న విషయం కాదు. వారిలో సహనం నశించిందని అర్థం చేసుకోవాలి.
బుగ్గవంక ప్రాజెక్టు విషయంలో చాలా రోజుల నుంచి నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుగ్గవంక అప్రోజ్ రోడ్డులో ఏళ్ల తరబడి పేదలు నివాసం ఉంటున్నారు. నిజానికి అది వారి స్థలమేమీ కాదు. కానీ రాజకీయ అండతో చాలా మంది పేదలు అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. కరెంట్ .. ఇతర మౌలిక వసతుల్ని కూడా అధికారులు కల్పించారు. కడపలో ఎప్పుడూ ఒక పార్టీదే ఆధిపత్యం. వారే వారికి అండగా ఉంటూ వచ్చారు. అందుకే అప్పో సప్పో చేసి అక్కడ శాశ్వత నివాసాలు కట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు బుగ్గవంక ప్రాజక్ట్ ను సుందరీకరించాలని చెప్పి.. అక్కడ ఉన్న వారందర్నీ ఖాళీ చేయమని ఆదేశించారు.
వారు ఉంటున్నది ప్రభుత్వ స్థలమే కాబట్టి.. పరిహారం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి… అందర్నీ ఉన్న పళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చి… హఠాత్తుగా జేసీబీతో కూల్చివేతలకు వచ్చారు. అక్కడ దాదాపుగా పదిహేను వందల కుటుంబాలు నివాసం ఉంటాయి. వీరంతా నగరంలో తోపుడు బండ్లు లాంటి చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పక్కా గృహాలు ఇస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదు. ఇళ్లను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి వారంతా కలెక్టరేట్ ముందు ఆందోళనలు కూడా చేస్తున్ారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆందోళనలతో సమస్య పరిష్కారంకాదని తిరగబడ్డారు.
ప్రభుత్వం ఇంజినీర్ రఘునాథరెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టొచ్చు. కానీ.. అది ఆరంభం మాత్రమేనని.. ఓ సంకేతం ప్రజలకు వెళ్లింది. అధికారం ఉంది కదా అని జేసీబీలో దూసుకెళ్తే… తిరగబడకుండా ఎవరూ ఉండరని.. భయం అనేది.. ఓ స్థాయి వరకే ఉంటుందని.. ఈ ఘటనతో నిరూపితమయిందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాలకు ఇదో హెచ్చరికగా భావించవచ్చని చెబుతున్నారు.