రాజకీయం తీరెరుగదు – పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదని సామెత. ఎలాంటి పరిస్థితుల్లోనూ… కాల పరీక్షలో ఎప్పటికప్పుడు ఇది నిజమే సుమీ అని.. నిరూపితమవుతూనే ఉంది. వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. ప్రజల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలా ఆన్నదానిపై.. పాలకులంతా తమ దృష్టి కేంద్రీకరించారు…కానీ తీరు ఎరుగని రాజకీయం చేసే ఆంధ్రలో.. భారత్‌లో మాత్రం… ప్రజల ప్రాణాల కన్నా… మరింకేదో ముఖ్యమైనది ఉందన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఆంధ్ర ప్రజలవి ప్రాణాలు కావా..!?
ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది..? బీహార్ కన్నా చాలా చిన్న రాష్ట్రం.. కేరళతో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణికులు.. మర్కజ్ యాత్రికులు తక్కువగా ఉన్న రాష్ట్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే… వైరస్ దాడి విషయంలో ఏపీ సేఫ్‌గా ఉండాల్సిన రాష్ట్రం. కానీ ఇప్పుడు దాదాపుగా వెయ్యి దగ్గరకు కేసులు వచ్చాయి. మరణాల సగటు చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు..?. వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారు. వైరస్‌ను చాలా అంటే చాలా తేలికగా తీసుకుని… వస్తుంది.. పోతుంది అన్న సిద్ధంతానికే కట్టుబడి వ్యవహరిస్తున్నారు. అది వస్తుంది అలాగే.. వెళ్లేటప్పుడు ప్రజల ప్రాణాల్ని తీసుకెళ్తుంది అనే విషయాన్ని గుర్తించడానికి సిద్ధపడటం లేదు. ప్రజల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయింది. లాక్ డౌన్ ప్రకటించేసిన నెల దాటిన తర్వాత .. ఏపీలో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో లేని విధంగా రోజుకు 80 కేసులు బయటపడటం… ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. 98 శాతం ప్రజలు… తమ జీవనోపాధిని సైతం… మర్చిపోయి… తమను.. తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉంటున్నారు. ఆ రెండు శాతం ప్రజల్ని కంట్రోల్ చేయలేక… ప్రజల నిత్యావసర వస్తువుల అవసరాలు తీర్చలేక ప్రభుత్వం… మొత్తానికి ప్రజల ప్రాణాలకు గండం తెచ్చి పెట్టింది.
పాలకుల అహం .. ప్రజలకు ప్రాణ సంకటం..!
వైరస్ అంత ప్రమాదకరం కాదన్నది.. భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర పాలకులకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. ప్రమాదాన్ని గుర్తించడానికి .. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇష్టపడక… అలాంటి అభిప్రాయాన్ని ఏర్పర్చుకుని ఉండవచ్చు. కానీ ఓ సారి అదెంత ప్రమాదకరమైన వైరస్సో తెలిసిన తర్వాత అందరూ అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల్లో విలయాన్ని చూసి.. అలాంటి పరిస్థితి ఇండియాకు వస్తే… ఇక కోలుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చి.. బేషజాలకు పోకుండా అప్పటికప్పుడు లాక్ డౌన్ ప్రకటించేశారు. పారాసిటమాల్‌తో వైరస్‌ను మాడ్చి మసి చేస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఇప్పడు ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదని… వైరస్ అత్యంత భయంకరమైనది … ఎలాంటి మొహమాటలు లేకుండా అంగీకరించి… ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో… దాన్ని కంట్రోల్ చేయడంపైనే దృష్టి పెట్టారు. గత ఆరేళ్ల కాలంలో ఓ అంశంపై కేసీఆర్ ఇంత సీరియస్‌గా దృష్టి పెట్టిన సందర్భం లేదనేది నిజం. అయితే.. ఏపీలో జరుగుతున్న ది మాత్రం వేరు… అక్కడ సీఎంకు.. పారాసిటమాల్‌తో పాటు.. బ్లీచింగ్ పౌడర్ కూడా … కరోనాను అంతం చేస్తుందనే నమ్మకం ఉంది. దాన్ని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. ప్రజలను ఆ వైరస్ ఏమీ చేయలేదని.. అది ఎవరికైనా వచ్చింది…పోయింది ఎవరికీ తెలియదని . .. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదన్నట్లుగా ఉన్నారు. ప్రతీ రోజూ ఓ సమీక్ష చేస్తారు. దాదాపుగా..రోజూ ఇచ్చే ఆదేశాలు ఇస్తారు. దాంతో పనైపోతుంది. కేంద్రం నుంచి వస్తున్న మార్గదర్శకాల ప్రకారం అధికారులు పని చేస్తున్నారు. సీఎం మాత్రం..రాజకీయ లబ్ది కార్యక్రమాలపై అదే పనిగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు.
డైవర్షన్ రాజకీయంతో ప్రజలకు జరిగే మేలేంటి..?
గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఫండ్ ను ఆ పార్టీ నేతలు ఎంత నొక్కేశారో బయటపెడతానని ఇప్పుడు చర్చకు పెట్టడం అవసరమా..? ప్రభుత్వంపై విమర్శలు చేసే వారందరూ టీడీపీకి అమ్ముడుబోయారని… తమకు ఇష్టం వచ్చిన భాషలో తిట్టాల్సిన రాజకీయం ఇప్పుడు అవసరమా..? …ప్రజలకు అవసరం లేదు.. కానీ పాలకులకు కావాలి. ఓ పెద్ద సమస్యను తీర్చలేకపోతున్నప్పుడు.. అంత కన్నా పెద్ద సమస్యను సృష్టించడమే రాజనీతి అని .. చాలా మంది నమ్ముతూ ఉంటారు. సోషల్ మీడియా సాయంతో… ప్రజల మైండ్ ఎలా అంటే అలా.. డైవర్ట్ చేయగలిగే కెపాసిటీ తెచ్చుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు కరోనా కన్నా.. పెద్ద సమస్య అంటూ.. కొన్ని రాజకీయ ఆరోపణల్ని తెరపైకి తెచ్చి.. అందరూ వాటిపై దృష్టి మళ్లించేలా చేస్తున్నారు. దాని కోసం వ్యక్తిగత విమర్శలు.. సవాళ్లు .. చాలెంజ్‌లు..ఇలా రోజులు గడిచిపోతున్నాయి. వారు చేసుకుంటున్న ఆరోపణల్లో నిజం ఉన్నా.. చివరికి ఒక్క శాతం కూడా బయటకు రాదు. అన్నీ ఆధారాలు ఉన్నాయన్న విజయసాయిరెడ్డి .. వాటిని బయట పెట్టరు. ఆయనపై అన్నీ ఆధారాలు ఉన్నా… ఆయన అలా స్వేచ్చగా తిరుగుతూనే ఉంటారు. ఇదంతా రాజకీయం… మధ్యలో.. వీరి షోలతో కాస్త ఆవేశపడి.. కాస్త చర్చలు జరిపి… మరింతగా… రాజకీయ భావావేశాలకులోనై ప్రజలు… అసలు సమస్యను మర్చిపోతారు. కానీ వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకోలేరు. అలాంటి ఆలోచనా స్థాయి రాకుండా.. ఆయా పార్టీలు.. సోషల్ మీడియా టీంలు… జాగ్రత్త పడుతున్నాయి.
ఢిల్లీలోనూ అదే డైవర్షన్ రాజకీయం..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీని అతీత శక్తులున్న నేతగా ప్రపంచానికి పరిచయం చేయడానికి .. మెజార్టీ బీజేపీ వాదులు అలవాటు పడిపోయారు. ఆయన పదహారు గంటల కర్ఫ్యూ ప్రకటిస్తే.. దెబ్బకు వైరస్ ఠా అనేశారు. తర్వాత మూడు వారాల లాక్ డౌన్ పైనా అంతే. కొనసాగింపు విషయంలోనూ అంతే. కానీ… వైరస్ ఎక్కడా కంట్రోల్ కాలేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిజానికి లాక్ డౌన్ పెట్టడం వల్ల వైరస్ కంట్రోల్ అయిందో లేదో ఎవరికీ తెలియదు. లేకపోతే.. ఈ పాటికి ఎనిమిది లక్షల కరోనా కేసులు ఉండేవని… ఆ పార్టీ మద్దతుదారులు అంటూంటారు. ఇప్పటికీ … దేశంలో అందులో సగం కూడా కరోనా టెస్టులు చేయలేదు. ఇప్పటికే అన్ని కేసులు ఉన్నాయేమో..? టెస్టులు చేస్తే బయటపడేవేమో..? అనేది చాలా మందిబుద్ది జీవుల ప్రశ్న. మరి లాక్ డౌన్ ఎక్కడ సక్సెస్ అయిందో ఎవరికీ తెలియదు. కానీ నాలుగైదుకోట్ల మంది వలస కూలీలు పడుతున్న కష్టాలు మాత్రం.. స్వతంత్ర భారతావని సాధించిన పురోగతిపై అనుమానాలు తెచ్చి పెట్టేవే. కరోనా కారణంగా దెబ్బతినే ఆర్థిక వ్యవస్థ వల్ల ఉపాధి కోల్పోయే.. కోల్పోయిన వారికి ఎలాంటి భరోసా లేకపోవడం…. భవిష్యత్ ఆకలి భారతానికి సూచికగా ఉండేవే. కానీ పాలకులకు వీటిని చక్కదిద్దడం కన్నా.. వాటి గురించి ప్రజలు చర్చించుకోకుండా చేయడమే లక్ష్యమన్నట్లుగా ఉంది. మహారాష్ట్రలో జరిగిన సాధువుల హత్యకు.. సోనియా గాంధీకి లింక్ పెట్టేసి.. ఇప్పుడు రాజకీయం చేయడమే అసలు కోణం. ఇప్పుడు ఆమె పౌరసత్వ అంశాన్ని బీజేపీ సోషల్ మీడియాలో చర్చకు పెడుతోంది. సోనియాగాంధీ సర్వీస్ అయిపోయింది. తప్పని సరి పరిస్థితుల్లో మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. మళ్లీ యాక్టివ్ అయ్యే పరిస్థితిలేదు. అయినా ఆమెను…. వైరస్ డైవర్ట్ రాజకీయంలో భాగంగా టార్గెట్ చేసుకున్నారు. దీని వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది..?
కొల్లేటరల్ డ్యామేజీ జరిగితే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు..!
ప్రజాస్వామ్యం అర్థం..పరమార్థం… ప్రజలకు మేలు చేసే పాలకులు వస్తారనే. కానీ మన దేశ ప్రజాస్వామ్యంలో మాత్రం.. ప్రజలకు మేలు చేయడం కన్నా రాజకీయం చేస్తే గెలిచేస్తామని నమ్ముతున్నారు. ఆ రాజకీయం ప్రజలకు మేలు చేయడం కాదు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం… కుల, మత, ప్రాంతాలపై ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టడం. వారిని నష్టపరుస్తున్నామని మరో వర్గాన్ని సంతృప్తి పరచడం.. ఇదే రాజకీయం. సొంత ప్రజల్ని ఇలా విభజించి.. వివక్ష చూపి.. మెజార్టీ ప్రజల్ని ఆకట్టుకోవడం వల్ల గెలుపు వస్తుందేమో కానీ.. అది వారి అభ్యుదయానికి దారి తీయలేదు. ఇతర సందర్భాల సంగతేమో కానీ.. ప్రపంచాన్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయిన వైరస్ విషయంలో… బేషజాలు… ద్వేష రాజకీయాల్ని పక్కన పెట్టి… పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించకపోతే… కలిగే నష్టం అంచనా వేయడం సాధ్యం కాదు. కొల్లేటరల్ డ్యామేజీనే జరుగుతుంది. దానికి … పాలకులు ప్రతిపక్ష పార్టీలదే తప్పని నిందించేసి.. తప్పించుకోవచ్చు. కానీ.. ప్రజలకు జరిగే నష్టాన్ని మాత్రం.. ఎవరూ భర్తీ చేయలేరు.