ఆగస్టు పదిహేనో తేదీ కల్లా కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించడం.. దేశంలో కొత్త దుమారం రేపుతోంది. వైద్య పరిశోధనల్లో ఎంతో ముందు ఉన్న దేశాలు కూడా ఇలాంటి డెడ్‌లైన్ పెట్టలేదన్న సంగతి వివిధ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఫలితాలు ఎలా వస్తాయో తెలియకుండా.. పరీక్షలు నిర్వహిస్తూ.. హ్యూమన్ క్లినికల్ ట్రయర్స్ ప్రారంభించి.. వ్యాక్సిన్ రిలీజ్ చేస్తామని ప్రకటించడం.. సరికాదని అటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దీన్ని ధృవీకరించిన ఐసీఎంఆర్.. హడావుడి చేస్తోంది.
ఐసీఎంఆర్ ప్రకటన వెనుక రాజకీయం ఉందని… కరోనాను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న విమర్శలు వైద్య వర్గాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఆగస్టు పదిహేనో తేదీన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో గొప్పగా చెప్పుకోవడానికే.. ఈ ప్రయత్నమని.. విపక్ష రాజకీయవర్గాలు అంటున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది. అది కూడా.. చేస్తున్న ప్రతి ప్రయోగం సక్సెస్ అయితే.. సైడ్ ఎఫెక్ట్లు లేనప్పుడే. ప్రస్తుతం… ఈ ప్రయోగ ఫలితాలు.. ఎలా ఉంటాయో.. ఎవరికీ తెలియదు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ ఫలితాలను విశ్లేషించడానికి చలా సమయం పడుతుంది. సైడ్ ఎఫెక్ట్లు అంచనా వేయడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చని.. వైద్య నిపుణులు అంటున్నారు.
అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. ఐసీఎంఆర్ కూడా వివరణ ఇచ్చింది. కోవ్యాక్సిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ అందజేసిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే తదుపరి అనుమతులు ఇచ్చామని చెప్పుకొచ్చింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే..వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెబుతోంది. అయితే.. సైన్స్ రాజకీయం అయితే.. మొదటికే మోసం వస్తుందని.. ఫార్మా రంగంలో భారత్‌కు ఉన్న మంచి పేరు.. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వద్ద దెబ్బతింటుందన్న ఆందోళన.. వైద్యవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.