తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమలో విధ్వంసం జరగడం కలకలం రేపుతోంది. దాదాపుగా వెయ్యి మందికిపైగా ఒక్క సారిగా పరిశ్రమపై దాడి చేసి.. గోడలు బద్దలు కొట్టి.. నిర్మాణాలకు.. కంటెయినర్లకు నిప్పు పెట్టారు. మీడియా పెద్దగా హైలెట్ చేయకపోయినప్పటికీ.. అక్కడ జరిగిన విధ్వంసం మాత్రం చిన్నది కాదు. ఇలా చేయడం వెనుక ఆందోళనకారుల ఆవేదన ఉంది. రాజకీయ పార్టీలు మోసం చేశాయన్న ఆగ్రహం ఉంది. తమను ఎవరూ పట్టించుకోకుండా.. రాజకీయంగా వాడుకుంటూ.. తమను కాలుష్యానికి బలి చేస్తున్నారన్న పట్టరాని కోపం ఉంది.
తొండంగిలోని సెజ్ కోసం సేకరించిన స్థలంలో దివీస్ పరిశ్రమ పెట్టాలని టీడీపీ హయాంలో నిర్ణయించారు. దానికి అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఆ పరిశ్రమ కాలుష్య కారకం.. వద్దంటూ.. వైసీపీ నేతలు.. రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. ప్రతిపక్ష నేత జగన్.. దివీస్ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. తాము గెలవగానే కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ దూరంగా తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. దీంతో అక్కడ ఆందోళనలు చేసిన వారి కడుపు మండిపోయింది.
జగన్ కూడా తమను మోసం చేశారంటూ.. అక్కడి ఆందోళనకారులు.. తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కొద్ది రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. కానీ వారిని అందరూ తేలికగా తీసుకోవడం… కాలుష్య కారక పరిశ్రమను బలవంతంగా అయినా తమ నెత్తిపై పెట్టబోతున్నారని వారిలో ఆవేదన పెరిగిపోవడంతో.. వారిలో సహనం నశించింది. ఫలితమే విధ్వంసకాండ. రాజకీయ పార్టీలు ప్రజల ఆందోళనలను ఆసరాగా చేసుకుని రాజకీయం చేసి.. తర్వాత మడమ తిప్పి వారిని బకరాలుగా చేస్తే.. ఇలాగే తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో వైసీపీ మాత్రమే కాదు.. టీడీపీ కూడా మడమ తిప్పింది. గతంలో దివీస్ పరిశ్రమకు అనుమతి ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అక్కడ పరిశ్రమ వద్దంటున్నారు. ఈ తీరుతోనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది.