తెలంగాణలో జనసేన పార్టీ తొలి సారి బీజేపీతో కలిసి పోటీ చేయబోతోంది. గతంలో కనీసం వార్డు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఈ సారి తొమ్మిది సీట్లను బీజేపీ కేటాయించడంతో .. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే బలమైన అభ్యర్థులు లేకపోవడతో చేరికలపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అందులోనూ బీజేపీ నేతలే కొంత మంది వచ్చి చేరుతూండటం ఆసక్తికరంగా మారింది.
జనసేనకు బీజేపీ ఇచ్చే స్థానాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అధికారిక ప్రకటన రాలేదు. శేరిలింగంపల్లి, తాండూరు ఇస్తారా లేదా అన్నదానిపై డౌట్ ఉంది. కూకట్ పల్లి సహా మరో ఎనిమిది నియోజకవర్గాలు ఖరారయ్యాయి. అక్కడ పోటీ చేయడానికి జనసేన పార్టీకి బలమైన అభ్యర్థుల కొరత ఉంది. తెలంగాణ జనసేన ఇంచార్త్ శంకర్ గౌడ్ కు ఏ స్థానం కేటాయిస్తారో ఇంకా స్పష్టత లేదు. కూకట్ పల్లి నుంచి టిక్కెట్ ఆశిస్తూ ఓ బీజేపీ నేత పార్టీలో చేరడంతో.. ఆయనకు ఆ సీటు ఖరారు కావడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
ఇతర నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల కోసం జనసేన జల్లెడ పడుతోంది. శేరిలింగంపల్లిని కేటాయిస్తే… తనకు టిక్కెట్ ఇవ్వాలని వెంటనే పార్టీలో చేరిపోతానని సత్యంరావు అనే కాంగ్రెస్ నేత లాబీయింగ్ చేసుకుంటున్నారు. రామగుండం కేటాయిస్తే.. టీవీ నటుడు సాగర్ ను బరిలోకి దింపనున్నారు. ఆయన పార్టీలో చేరారు. జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణలో పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అదే సమయంలో కేటాయించే సీట్లపై బీజేపీ నాన్చుతూండటం…. నామినేషన్లు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో బీజేపీ ఏ గేమ్ ప్లాన్ అమలు చేస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.