అసెంబ్లీలో ఈటల రాజేందర్ ఎదురుపడకూడదని కోరుకుంటున్న కేసీఆర్.. ఈ సారి కూడా పక్కా వ్యూహం అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హుజూరాబాద్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తప్ప అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేకపోయారు. గత సమావేశాల సందర్భంగా సస్పెండ్ చేశారు. ఈ సమావేశాల్లో మరోసారి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. బీఏసీ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని పిలువలేదని ఈటల రాజేందర్ స్పీకర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ చెప్పినట్లుగా వింటున్నారని మండిపడ్డారు. ఇవి సాధారణంగా చేసే విమర్శలే . అయితే టీఆర్ఎస్ నేతలకు.. మాత్రం.. ఆయనను సస్పెండ్ చేయాడానికి సరిపోతుందని తీర్మానించేసుకున్నారు.
వెంటనే సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి.. ఈటల స్పీకర్‌ను కించ పరిచారని ఇది ఖండనీయమని.. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వ్యవస్థలను దిగజారుస్తున్న బీజేపీ కి స్పీకర్ ను అవమానపరచడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదని.. ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో వ్యవహరిస్తే మరి లోక్ సభ స్పీకర్ పీఎం మోడీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు.
స్పీకర్ విషయం లో మాట్లాడేముందు సభ్యులు ఒకటి కి రెండు సార్లు ఆలోచించాలని,స్పీకర్ ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీ ని అవమానపరిచినట్టే అని మంత్రి వేముల అన్నారు. స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని, ఈటెల స్పీకర్ కు క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడేందుకు సభా నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని హెచ్చరించారు. ఈటల అంత అభ్యంతరకరమైన మాటలేమీ మాట్లాడలేదు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పకపోవచ్చు. అసెంబ్లీ జరుపుతోంది రెండు రోజులే కాబట్టి.. ఈ రెండు రోజులూ ఈటలపై వేటు వేసే అవకాశం ఉంది.
ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరు పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నారు. మరొకర్ని సస్పెండ్ చేస్తే ఇక రఘునందన్ రావు ఒక్కరే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటారు.