రాజకీయ నేతలు పని గట్టుకుని మరీ ప్రజల్ని అమాయకుల్ని చేద్దామనుకుంటున్నారా లేకపోతే ప్రజలు అమాయకులే కాబట్టి వారికి తగ్గట్లుగా మాట్లాడాలనుకుంటున్నారా అన్న దానిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరికి వరదలు వస్తే విదేశీ కుట్ర ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. క్లౌడ్ బరస్ట్ అనే పదంతో చర్చ ప్రారంభమయ్యేలా చేశారు. దీంతో అందరూ ఇతర ప్రజాసమస్యలను వదిలేసి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌పై చర్చ ప్రారంభించారు. బీజేపీ నేతలు .. కాంగ్రెస్ నేతలు ఆయనపై మండి పడుతున్నారు. ఆయనకు ఉన్న అవగాహన అదేనా ప్రశ్నిస్తున్నారు.
కానీ కేసీఆర్ అన్న మాటల్లో కాస్త రీజనింగ్ ఉంది. ఎందుకంటే కొన్ని దేశాలు.. ఇలా కృత్రిమంగా వాతావరణ మార్పులతో శత్రుదేశాలపై అప్రకటిత యుద్ధం ప్రకటిస్తున్నాయని స్పష్టత ఉంది. ఇంతకు మించి కామెడీ చేసిన నేతలు ఇటీవలి కాలంలో ఉన్నారు. కేసీఆర్ కన్నా తక్కువ స్థాయి నేతలు చేస్తే పరిగణనలోకి తీసుకోకపోవచ్చు కానీ.. ఆయన కన్నా అత్యున్నత స్థాయి నేతలు ఇంత కంటే ” మైండ్ బ్లోయింగ్ ” వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిలో ప్రధాని మోడీ ముందు ఉంటారు.
మన యుద్ధ విమానాలు.. మేఘాల చాటున దాక్కుని పాకిస్థాన్ రాడార్లకు చిక్కకుండా.. వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని స్వయంగా ప్రధాని మోదీ ఓ ఇంటర్యూలో చెప్పారు. ఆ ఇంటర్యూ వీడియోక్లిప్ చూస్తే.. ఆయన హావభావాలు మారుస్తూ యాక్షన్ చేసి చూపించారు. అప్పట్లో మోడీ విషయ పరిజ్ఞానం ఆ స్థాయిలో ఉందా అని విచిత్రంగా చూశారు. అదే కాదు ఆ తర్వాత చాలా సార్లు ఆయన విజ్ఞాన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సమావేశంలో విండ్ టర్బైన్ కంపెనీ సీఈవోతో మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి మరల నుంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆక్సీజన్, శక్తిని పొందవచ్చని మోడీ ఆ కంపెనీ సీఈఓకి సూచించారు. ఆ కంపెనీ సీఈవో ఫేస్ ఎలా ఉందో చూపించలేదు కానీ.. వాటి గురించి తెలిసిన వారు మాత్రం వీపు చరుచుకోవాల్సివచ్చింది.
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.. మోదీ స్థాయిలోనే ఇలా ఉంటే ఇంక కింది స్థాయి నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇలాంటివి చెబుతున్న వారందరికీ వాట్సాప్ యూనివర్శిటీ స్కాలర్స్ అని పేరు పెట్టేశారు. అయితే విచిత్రంగా వారు కూడా కేసీఆర్‌ను విమర్శించడమే ఇక్కడ కొసమెరుపు.