మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇతర పోటీదారులు ఎంత మంది ఉన్నా.. ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రకటించి హంగామా చేశారు. పోటీకి సిద్ధమవుతున్న విష్ణు.. తాను స్పందించకపోతే బాగుండని అనుకున్నారేమోకానీ.. ఆయన కూడా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేశారు. హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు లాంటి వారు బరిలో ఉంటామని చెబుతున్నారు. సినిమా వాళ్లపై ప్రజలకు ఉండే సహజమైన ఆసక్తి కారణంగా మీడియా కూడా ఈ గొడవలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఇప్పుడు మెల్లగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రాజకీయ సంబంధాలను బయటకు తీసి.. కొంత మంది చర్చ పెడుతున్నారు. ఇది వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా కొంత మంది సమీకరణాలు లెక్క తీస్తున్నారు. దీనికి కారణం ఉంది.. ప్రకాష్ రాజ్.. టీఆర్ఎస్కు అత్యంత సన్నిహితుడు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మూడో కూటమి పెట్టాలనుకున్నప్పుడు.. ప్రకాష్ రాజ్.. జేడీఎస్ పార్టీ అధినేతల దగ్గరకు స్వయంగా తీసుకెళ్లాడు. తర్వాత అనేక సార్లు.. టీఆర్ఎస్ పెద్దలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. ఎన్నికల్లో మద్దతు ప్రకటనలు చేశారు. ఓ సందర్భంలో ఆయనకు టీఆర్ఎస్ తరపున ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. టీఆర్ఎస్తో అంత దగ్గరి సంబంధాలు ఉన్న ప్రకాష్‌రాజ్‌కు.. మా ఎన్నికల్లో టీఆర్ఎస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న అంచనా ఉంది.
ఇక మరో పోటీదారుగా ఉండబోతున్న మంచు విష్ణుకు ఏపీ అధికార పార్టీ అండ ఉంది. ఆ వైపు నుంచి ఎలాంటి సహకారం అందాలన్నా అందుతుంది. ఎన్నికలకు ముందు వైసీపీకి మంచు ఫ్యామిలీ చేసిన సాయం అంతా ఇంతా కాదు. స్వయంగా రోడ్డెక్కి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆ తర్వాత అధికారికంగా మోహన్ బాబు వైసీపీలో చేరారు. అంతకు మించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుని కుమార్తెను మంచు విష్ణు పెళ్లిచేసుకున్నారు. అంత దగ్గర సంబంధాలు ఉన్నందున.. వైసీపీ తరపున.. ఏపీ ప్రభుత్వం తరపున అందాల్సి నహకారం మొత్తం అందుతుంది. అందుకే.. మా ఎన్నికలు వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా కొంత మంది చూస్తున్నారు.
నిజానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు చొరబడలేదు. గతంలో కూడా ఆసక్తికరమైన పోటీలు జరిగినా.. సినీ పరిశ్రమలో ఉన్న వర్గాలే పోటీపడ్డాయి. కానీ ఇప్పుడు రాజకీయం చొరబడితే మాత్రం .. సినీ పరిశ్రమ మరింతగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు.