స్థానిక ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వ్యవహారం రివర్స్ల్లోనే రివర్స్‌గా మారి ఆ పార్టీ నేతలను సైతం గందరగోళ పెట్టేస్తోంది. మొదట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించనే వద్దని …అన్ని రకాల ప్రయత్నాలు చేసి.. చివరికి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఓ ఆర్డినెన్స్‌తో తొలగించేసిన ప్రభుత్వం ఇప్పుడు.. ఆయనే ఎన్నికలు పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఈ ఒత్తిడి ఎలా ఉందంటే… ఎన్నికలు పెట్టకపోతే.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ పేరుతో బెదిరించేంతగా ఉంది. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు నిర్వహించకూడదన్న ఒకే ఒక్క లక్ష్యం.. హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో మార్చిమార్చి చేసిన న్యాయపోరాటం మొత్తం ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నిమ్మగడ్డే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పుడు పట్టు బడుతున్నారు.
గతంలో ఎన్నికలు నిర్వహించంవద్దనడానికి వ్యాక్సినేషన్ కారణాన్ని హైకోర్టు వరకూ తీసుకెళ్లి వాదించారు. అయితే ఎన్నికలకు.. వ్యాక్సినేషన్ అడ్డంకి కాబోదని కోర్టులు ఎన్నికలకు అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు… ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ వ్యాక్సినేషన్‌నే కారణంగా చూపిస్తున్నారు. వ్యాక్సినేషన్ వేస్టేజీ గురించి ప్రధాని మోడీ ఏపీ సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తే.. వెంటనే సీఎం జగన్ దాన్ని ఎన్నికలతో ముడి పెట్టేసి..ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిందని.. మిగతా ఎన్నికల ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం.. ఇంటే ఇదేనని అందరూ అశ్చర్యపోయేలా చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. పరిషత్ ఎన్నికలపై ఇంకా కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కాదని ఆయన నోటిఫికేషన్ జారీ చేయలేరు. దీంతో ఆయన తన ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు సెలవు పెడుతున్నారు. ఆయన సెలవు పెడితే.. ఎన్నికలు నిర్వహించరన్న ఉద్దేశంతో ఆయనను నిలుపుదల చేయడానికి..ఇక్కడే ఉంచడానికి… ప్రవిలేజ్ కమిటీని సైతం ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఎన్నికలు వద్దనడానికి ఎన్ని రాజకీయ వ్యూహాలు అమలు చేశారో.. ఇప్పుడు పెట్టమనడానికి కూడా అదే స్థాయిలో వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు.
మొదట్లో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే… కరోనా ..గిరోనా లేదు…ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నారు. లాక్ డౌన్ అంతా అయిపోయాక.. ఎన్నికలు నిర్వహించాలనకుకుంటే కరోనా కారణంగా వద్దన్నారు. తర్వాత వ్యాక్సినేషన్ ఉంది ఎన్నికలు నిర్వహించవద్దన్నారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడానికి వ్యాక్సిన్‌ను కారణంగా చూపిస్తున్నారు. గతంలో నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు పెట్ట కూడదనుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డే ఎన్నికలు పెట్టాలని ప్రివిలేజ్ కమిటీ పేరుతో బెదిరించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల విషయంలో ఇన్ని రివర్స్లు ఎందుకో… వైసీపీ పెద్దలకైనా అర్థం అవుతుందో లేదో..!