నెల్లూరు సిటీ రాజకీయం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఓ వైపు మంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తే.. జిల్లాలో ఆయన వ్యతిరేకులు విశ్వరూపం చూపిస్తున్నారు. తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన కిందా మీదా పడి ఆరోపణలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ లోపు ఆయన కుటుంబం నుంచే సొంత కుంపటి ప్రారంభమయింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ .. అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్. ఆయన ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఇంత కాలం తామంతా ఒకటే కుటుంబం అన్నట్లుగా ఒకే ఆఫీసు నుంచి కార్యకలాపాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు రూప్ కుమార్ సొంత ఆఫీసు పెట్టుకున్నారు. తనకు మద్దతుగా ఉంటున్న పదకొండు మంది కార్పొరేటర్లను పిలిచి ఈ ఆఫీసుకు శంకుస్థాపన చేసుకున్నారు. బాబాయ్ – అబ్బాయ్ ల మధ్య గొడవలోకి తామెందుకు ఇతర పార్టీ నేతలెవరూ రాలేదు. కానీ.. రూప్ కుమార్‌కు మద్దతు వెనుక తమ పార్టీకి చెందిన పెద్దల మద్దతు ఉందన్న అనుమానం అనిల్ కుమార్లో ఉంది. దీంతో ఆయనను కొంత కాలంగా దూరం పెడుతూ వస్తున్నారు. అవి అంతకంతకూ పెరిగి సొంత కుంపటి పెట్టుకునేవరకూ వెళ్లింది.
అనిల్ కుమార్‌కు మంత్రి పదవిరావడమే మైనస్‌గా మారింది. మంత్రిగా ఆయన వ్యవహరించిన తీరుతో సొంత పార్టీ నేతలందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇలా వచ్చి అలా పోయిన మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడాయకు ఇబ్బందికరంగా మారింది. కుటుంబంలో తనకు పోటీ రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. సిటీలో ఆయనపై వ్యతిరేకత ఉందన్న కారణం చెప్పి.. వచ్చే ఎన్నికల్లో రూప్ కుమార్‌కే టిక్కెట్ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతాయన్న వాదన అనిల్ కుమార్ వర్గీయుల్లో వినిపిస్తోంది.